‘’కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంపడం ఖాయం’’ అని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్న మాటలు మంటలు రేపుతున్నాయి.
మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. ‘నా మంగళసూత్రం తెంపే దమ్ము ఎవడికి ఉంది ? మీరు కట్టిన మాంగళ్యం విలువ తెలియదు కాబట్టి మీరు తాళికట్టిన ఆడబిడ్డ ఎక్కడో అమాయకంగా బతుకుతుంది. మీరు కట్టిన మంగళసూత్రం ఉరి తాడు అయింది. మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలి. మోడీ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ‘సంసారం చేయని ప్రధాని మోదీకి మంగళసూత్రం విలువ ఏం తెలుసని, ఆయన 140 కోట్ల జనాభాకు ప్రధాని అన్న విషయం మరిచి మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక వర్గానికి అనుకూలం అన్న ప్రధాని వ్యాఖ్యలు సిగ్గుచేటని’ విమర్శించారు.
మొదటి విడత 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. నాలుగో దశ ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో దేశంలో రాజకీయ పార్టీల ప్రచార ఉదృతితో పాటు, విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగాయి. ఎన్నికలు ముగిసే లోపు ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో వేచిచూడాలి.