తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గం చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇంటి పేరు కొండా. కానీ, ఇప్పుడు ఆయన ఆస్తులు, సంపద తెలిసిన తర్వాత.. ఆయనను కొండా విశ్వేశ్వరరెడ్డి కాదు.. కోట్ల
విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు నెటిజన్లు. తాజాగా కొండా తన స్థానానికి నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు.
నామినేషన్ వేసేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇక, యధావిధిగా.. ఆయన నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించిన అఫిడవిట్లను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీనిలో ఆయన చూపిన ఆస్తి ఏకంగా.. రూ.4 వేల కోట్ల పైచిలుకు కావడం గమనార్హం. ఇదేమీ సామాన్యమైన ఆస్తి కాదు. ఇప్పటి వరకు అఫిడవిట్లు సమర్పించిన వారిలో కొండా విశ్వేశ్వర రెడ్డికి మాత్రం ఇన్ని వేల కోట్లు ఉండడం గమనార్హం.
ఇవీ ఆస్తులు..
కొండా విశ్వేశ్వరరెడ్డి పేరిట ఆస్తులు: రూ.1178.72 కోట్లు
భార్య సంగీతారెడ్డి పేరు మీద ఉన్న ఆస్తులు: రూ.3,203.90 కోట్లు
ఇవి కాకుండా భూములు, ఇతర ప్రాంతాల్లో ఉన్న భవనాల విలువ: రూ.71.35 కోట్లు
మొత్తంగా ఆస్తులు: రూ. 4453.97 కోట్లు
ఇదీ ప్రస్తానం
కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి చాలా మందికి తెలియని విషయం.. ఈయన ఉమ్మడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెంకట రంగారెడ్డి మనవడు. ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లా పేరు ఈయనదే. ఇక, కొండా తండ్రి.. కొండా మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. విశ్వేశ్వర్ రెడ్డి సాఫ్ట్‌వేర్ కంపెనీ.. కోట రీసెర్చ్, సొల్యూషన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించారు.
2013లో రాజకీయాల్లోకి వచ్చిన కొండా.. అప్పట్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018, నవంబరులో బీఆర్ ఎస్‌కు రాజీనామా చేసి సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తరువాత 2021 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాసి, 2022లో బీజేపీలో చేరారు. ఇప్పుడు చేవెళ్ల నుంచి బరిలో ఉన్నారు.