ఎన్టీఆర్, చరణ్‌లను చూసి మహేష్ నేర్చుకోవాలి

ఎన్టీఆర్, చరణ్‌లను చూసి మహేష్ నేర్చుకోవాలి

18 ఏళ్ల వయసులోనే ‘సింహాద్రి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ వయసులో అంత పెద్ద సక్సెస్ వస్తే డీల్ చేయడం కష్టం. ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేశాడు. నంబర్ వన్ స్థానం మీదే తన గురి అని ఒక సందర్భంలో ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో తన ప్రతి సినిమా రిలీజ్ ముంగిట రికార్డుల గురించే మాట్లాడేవాడు. ఐతే ఒక దశ దాటాక వరుస ఫ్లాపులతో అల్లాడిపోయాడతను. దెబ్బకు రికార్డుల ఊసెత్తడం మానేశాడు. మళ్లీ హిట్ కొడితే చాలన్నట్లు తయారైంది పరిస్థితి. ‘టెంపర్’తో మళ్లీ సక్సెస్ అందుకున్నాక ఎన్టీఆర్‌లో పరిణతి వచ్చింది. గతంలో మాదిరి కలెక్షన్లు, రికార్డుల గురించి మాట్లాడ్డం మానేశాడు. వయసుతో పాటు వచ్చిన పరిణతి కూడా ఎన్టీఆర్‌ను మార్చింది. ఇది ఎన్టీఆర్ కథ.

ఇక రామ్ చరణ్ సంగతి చూద్దాం. ‘మగధీర’ సక్సెస్ తర్వాత అతను కూడా కొంచెం విర్రవీగాడు. యారొగెంట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ ‘ఆరెంజ్’ సినిమా అతడిని నేలమీదికి తెచ్చేసింది. ‘తుఫాన్’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఐతే మళ్లీ ‘రచ్చ’తో హిట్ కొట్టాక చరణ్‌లో యారొగెన్స్ వచ్చింది. నాయక్ సమయంలో అతనెలా ఉన్నాడో తెలిసిందే. కానీ ‘బ్రూస్ లీ’తో వాస్తవం బోధపడింది. ‘ధృవ’ నుంచి అందరికీ కొత్త చరణ్ కనిపించాడు. ‘రంగస్థలం’ టైంలో పూర్తిగా అతను కొత్తగా కనిపించాడు. అంత పెద్ద సక్సెస్ అందుకుని కూడా ఎక్కడా విర్రవీగలేదు. అసలు తన సినిమాల పోస్టర్ల మీద కలెక్షన్లే వేయొద్దు అంటూ నిర్మాతలకు గట్టిగా చెప్పాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాక కూడా అణకువతోనే వ్యవహరించాడు. కలెక్షన్లు, రికార్డుల గురించి ఎక్కడా ఒక్క మాటా మాట్లాడలేదు. వయసులో చిన్నవాళ్లయినా ఎన్టీఆర్, చరణ్‌ల పరిణతికి అభినందనలు చెప్పాల్సిందే.

ఐతే వయసు, అనుభవంలో వీళ్లిద్దరికంటే పెద్దవాడైన మహేష్ బాబు మాత్రం వీరికి భిన్నంగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మహేష్ మాటెత్తితే చాలు.. కలెక్షన్లు, రికార్డులంటాడు. ‘మహర్షి’ రిలీజ్‌కు ముందు అదే మాట. రిలీజ్ తర్వాతా అదే మాట. ఒకటికి రెండుసార్లు కాలర్ లేపడం పట్ల చాలా వరకు వ్యతిరేకతే కనిపించింది. అది చాలదన్నట్లు ఎక్కడ చూసినా ‘మహర్షి’ వసూళ్ల గురించే మాట్లాడుతున్నాడు. వారం రోజుల్లోనే తన పాత సినిమాల వసూళ్ల రికార్డుల్ని ‘మహర్షి’ దాటేసిందంటే ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ లాంటి మైల్ స్టోన్ మూవీస్‌ను తక్కువ చేశాడు. ఇక మహేష్ ప్రతి సినిమాకూ పోస్టర్ల మీద పడుతున్న కలెక్షన్ ఫిగర్స్ జనాలకు దిమ్మదిరిగేలా చేస్తున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉండి ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన హీరో ఇలా పదే పదే వసూళ్ల గురించి, రికార్డుల గురించి మాట్లాడటం.. ఎగ్జాజరేట్ చేసిన కలెక్షన్ల ఫిగర్స్ పోస్గర్ల మీద వేస్తుంటే సైలెంటుగా ఉండటం సగటు ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్టీఆర్, చరణ్‌లను చూసి అయినా మహేష్ మారాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English