అల్లు అరవింద్.. ఓ మంచి బిజినెస్‌మ్యాన్

అల్లు అరవింద్.. ఓ మంచి బిజినెస్‌మ్యాన్

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సినిమా చేయాలనుకుంటే మెగా ఫ్యామిలీలోనే కావాల్సినంత మంది హీరోలున్నారు. ఆయనకే ఇద్దరు కొడుకులున్నారు. అలాగని వాళ్లతో ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేయడు. మిగతా మెగా హీరోలతో కూడా ఆచితూచి సినిమాలు చేస్తుంటాడు. సినిమాల విషయంలో ఫ్యామిలీ ఫ్యామిలీనే.. బిజినెస్ బిజినెస్సే అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యవహారం. చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు.

ఆయన అనుకుంటే బెల్లంకొండ సురేష్ లాగా కొడుకు మీద కోట్ల మీద కోట్లు పోసి సినిమా తీసేయొచ్చు. కానీ అరవింద్ అలా చేయడు. అన్నీ చూసుకునే ఏదైనా సినిమాను ఆయన మొదలుపెడతారు. బిజినెస్ విషయంలో పక్కాగా ఉంటాడు. ఒకప్పుడు అరవింద్ మెగా ఫ్యామిలీకే పరిమితం అయ్యాడు కానీ.. ఇప్పుడలా కాదు. ఎక్కువగా బయటి హీరోల మీదే ఫోకస్ పెడుతున్నాడు.

మంచి మార్కెట్ ఉన్న హీరోల్నే చూసి ఆచితూచి బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని రెండో ఇన్నింగ్స్‌లో ఫాం అందుకోగానే అతడితో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మీడియం బడ్జెట్ సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్ అయి భారీగా డబ్బులు తెచ్చింది. ఇక విజయ్ దేవరకొండలో విషయం ఉన్న సంగతి త్వరగా గుర్తించి అతడితో రెండు కమిట్మెంట్లు తీసుకున్నాడు. ఆ రెండు సినిమాలూ ఆయనకు భారీగా ఆదాయం అందించాయి. గతంలో ఆమిర్ ఖాన్‌తో ‘గజిని’.. నాగచైతన్యతో ‘100 పర్సంట్ లవ్’ తీసి బాగా సొమ్ముచేసుకున్నాడు. ఇక వర్తమానంలోకి వస్తే.. తన పెద్ద కొడుకు అల్లు అర్జున్‌తో రెండు సినిమాలకు సన్నాహాలు చేస్తూనే సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఆయన దృష్టి సారించినట్లు సమాచారం.

మహేష్‌తో ఒక సినిమా చేయడానికి నమ్రతతో సంప్రదింపులు జరుపుతున్నాడట అరవింద్. మహేష్ స్థాయికి తగ్గట్లే పారితోషకం ఇచ్చి.. అదే స్థాయిలో తాను కూడా గట్టిగా బిజినెస్ చేసుకుని సినిమాతో మంచి లాభాలు అందుకుందామని ఆయన ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి అరవింద్ వ్యవహారం చూస్తే ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమాలు చేయాలో ఆయనకు బాగా తెలుసని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English