‘యాత్ర’కు నిజంగా వాళ్ల సపోర్ట్ లేదా?

‘యాత్ర’కు నిజంగా వాళ్ల సపోర్ట్ లేదా?

రాజకీయ నాయకుల మీద సినిమాలు తీస్తూ.. ఆ నాయకులకు చెందిన పార్టీల సహకారం లేదంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఐతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ‘యాత్ర’ సినిమా తీసిన మహి.వి.రాఘవ్ మాత్రం ఈ సినిమాకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలేమాత్రం సంబంధం లేదని అన్నాడు. దీన్ని రాజకీయ చిత్రంగా అస్సలు చూడొద్దని అన్నాడు. తనకు వైఎస్ మీద సినిమా చేయాలనిపించి చేశానని.. సినిమా పూర్తవుతున్న దశలో జగన్‌కు టీజర్ చూపించానని, ఆయన మార్పులు చేర్పులు కూడా చెప్పలేదని.. నీకెలా అనిపిస్తే అలా తీయి అని ఒక్క మాటలో తేల్చేశాడని అన్నాడు మహి. అతను ఇంతలా చెప్పాడు కాబట్టి సినిమా ఎలా ఉంటుందో చూద్దామనుకున్నారు ప్రేక్షకులు. ఐతే ‘యాత్ర’ చూస్తుంటే వైఎస్ మీద అభిమానంతో మహి సినిమా తీసిన మాట వాస్తవమే కానీ.. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్యాకప్ లేదంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు.

ఈ సినిమాలో చూపించినట్లు వైఎస్ మరీ దేవుడేమీ కాదు. ఆయనలోనూ ప్రతికూల లక్షణాలున్నాయి. కానీ వాటిని ఎక్కడా చూపించలేదు. అసలు ప్రస్తావనే లేదు. కేవలం వైఎస్‌లోని సుగుణాల్ని మాత్రమే చూపించారు. ఆయన్ని అడుగడుగునా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు చంద్రబాబును, ఆయన పార్టీ తెలుగుదేశంను విలన్ని చేసే ప్రయత్నం చేశారు. సెటైర్లు బాగానే వేశారు. దీనికి మించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తగులుకున్నడు. వాళ్లను విలన్లను చేశారు. సినిమాను ముగించిన వైనం చూస్తే.. వైఎస్ అభిమానుల్లో భావోద్వేగాల్ని రేకెత్తించాలనే ప్రయత్నం కనిపించింది. పైగా జగన్‌ను సీన్లోకి తెచ్చి వైఎస్ ఆశయాల్ని నెరవేరుస్తానని అతను చెబుతున్నట్లు చూపించారు. ఇదంతా చూస్తే దీన్ని ప్రాపగండా ఫిలింగా చూడకుండా ఎలా ఉంటాం? ఎన్నికల ముంగిట ప్రచారానికి ఈ చిత్రాన్ని వైకాపా బాగానే వాడుకునేందుకు ఆస్కారముంది. మహి సినిమా బాగానే తీశాడు, వైఎస్ మీద అతడికి నిజంగా అభిమానం ఉండొచ్చు. ఐతే వైకాపా బ్యాకప్ లేకుండా.. ఈ ప్రయత్నం చేశాడంటే మాత్రం సినిమా చూసిన ఎవ్వరూ నమ్మరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English