ఎన్ని హిట్లిచ్చినా నమ్మరేంటబ్బా?

ఎన్ని హిట్లిచ్చినా నమ్మరేంటబ్బా?

టాలీవుడ్లో చాలామంది దర్శకులు హీరోల్ని బట్టి కథలు తయారు చేసేవాళ్లే. హీరో ఫిక్స్ అయ్యాక కథ రాసి.. ఆ తర్వాత సినిమా తీస్తుంటారు. ఎప్పుడైనా కథ ముందు మొదలుపెట్టినా.. హీరో ఖరారయ్యాక అతడి ఇమేజ్‌ను బట్టి స్క్రిప్టు తీర్చిదిద్దుతారు. అలా కాకుండా కథ రాసుకుని దానికి తగ్గ హీరోను ఎంచుకునే దర్శకులు ఇక్కడ చాలా తక్కువమంది. శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి దర్శకులు ఆ కోవకే చెందుతారు.

కానీ ఇలాంటి దర్శకుల్ని స్టార్ హీరోలు నమ్మరు. కథే ప్రధానంగా సాఫ్ట్ సినిమాలు తీసే ఈ దర్శకులు తమను సరిగా డీల్ చేయలేరేమో అని హీరోల సందేహం. శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చినా.. ఇంద్రగంటి ‘అష్టాచెమ్మా’, ‘జెంటిల్‌మేన్’, అమీతుమీ’, ‘సమ్మోహనం’ లాంటి డీసెంట్ మూవీ అందించినా.. ఇప్పటిదాకా ఒక స్థాయికి మించి హీరోలతో అవకాశాలు అందుకోలేదు.

ఇంద్రగంటి టాలెంట్ ఏంటో.. ఆయన అభిరుచి ఎలాంటిదో అందరికీ తెలుసు. ప్రస్తుత ట్రెండుకు తగ్గ సినిమాలు చేయగలరాయన. శేఖర్ కమ్ముల సంగతేంటో కానీ.. ఇంద్రగంటికి కొంచెం పెద్ద హీరోలతో పని చేయాలని ఉంది. ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పాడు కూడా. కానీ ఆయన ఆశించిన హీరోలెవ్వరూ దొరకట్లేదు. ఇంతకుముందు మీడియం రేంజి హీరో అయిన నాగచైతన్యతో ఓ సినిమా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది.

తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు ఇంద్రగంటి. కొంచెం పేరు మోసిన హీరోలతోనే ఈ సినిమా చేయాలనుకున్నాడు. ఈ సినిమాకు అంతా ఓకే అనుకున్నాక బ్రేక్ పడింది. ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు తన ఫేవరెట్ హీరో నానితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. నాని కూడా ఇప్పుడు ఇంద్రగంటి స్థాయిని దాటిపోయాడు. ఐతే తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఆయనతో పని చేస్తున్నాడు. లేదంటే మిగతా స్టార్ల లాగే ఇంద్రగంటిని అతను కూడా నమ్మేవాడు కాదేమో. నాని సినిమా తర్వాత ఇంద్రగంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఎంత టాలెంట్ ఉన్నప్పటికి ఎప్పుడూ చిన్న స్థాయి సినిమాలే చేసుకోవాల్సి వస్తుండటం ఇంద్రగంటిని అసహనానికి గురి చేసేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English