బాలయ్యలో అంతర్మథనం?

బాలయ్యలో అంతర్మథనం?

దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం నందమూరి బాలకృష్ణది. ఐతే ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నడూ నిర్మాణం జోలికి వెళ్లని బాలయ్య.. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’ సినిమాతో నిర్మాతగా మారాడు. ‘ఎన్.బి.కె. ఫిలిమ్స్ ఎల్ఎల్‌పీ’ పేరుతో బేనర్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి కూడా నిర్మాణ భాగస్వాములైనప్పటికీ.. వారి పాత్ర నామమాత్రం. మధ్యలో బాలయ్యే పూర్తిగా సినిమాను టేకప్ చేశాడు. నిర్మాతగా కూడా ఆయన సతీమణి వసుంధరా దేవి పేరే పడింది. ముందు తన తండ్రి సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణంలోకి వచ్చిన బాలయ్య.. ఆ తర్వాత ఈ సినిమాకు వచ్చిన క్రేజ్.. బిజినెస్ ఆఫర్లు చూసి అత్యాశకు పోయారని అంటారు. భారీ రేట్లకు సినిమా అమ్మి భారీగా సొమ్ము చేసుకున్నట్లు వార్తలొచ్చాయి.

బాలయ్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షేర్ రూ.60 కోట్లకు దగ్గరగా వచ్చింది. పైగా అది స్పెషల్ మూవీ. అలాంటిది ‘యన్.టి.ఆర్’లో ఒక భాగానికే థియేట్రికల్ రైట్స్ రూ.70 కోట్లకు పైగా పలకడం అనూహ్యం. ఇతర ఆదాయాలు కూడా కలిపితే బాలయ్యకు భారీగానే లాభం వచ్చింది. రెండో భాగం కూడా అమ్మితే బాలయ్య లాభం ఊహించని స్థాయిలో ఉంటుందనుకున్నారు. ఈ నిర్మాణం భలే లాభసాటిగా ఉందే అని బాలయ్యకు అప్పుడు అనిపించి ఉంటే ఆశ్చర్యం లేదు. కానీ ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ రిలీజ్ తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ సినిమా రూ.50 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. దీంతో ‘మహానాయకుడు’ను ఉచితంగా ఇచ్చేయాల్సి వచ్చింది. అయినా కూడా నష్టాలు పూడ్చడం కష్టంగానే ఉంది. రిలీజ్ తర్వాత పరిస్థితిని బట్టి బయ్యర్లకు కొంత మేరకు పరిహారం ఇవ్వాల్సి రావచ్చేమో.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాతో బాలయ్య లాభాలు అందుకోకపోగా.. చేతి నుంచి పెట్టాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదేమో. నెల కిందట ‘యన్.టి.ఆర్’తో పంట పండిందనుకున్న సమయంలో బాలయ్య ఉత్సాహంగా బోయపాటితో తన తర్వాతి సినిమాను కూడా సొంత బేనర్లోనే తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. దాంతో కూడా బాగానే లాభాలు చేసుకోవచ్చనుకున్నాడు. కానీ ప్రొడక్షన్లో ఉన్న సమస్యలేంటో ఈ మధ్య బాలయ్యకు బాగానే బోధపడింది. దీంతో ఇప్పుడు ఆయన అంతర్మథనంలో పడ్డాడట. సొంతంగా ఈ సినిమాను నిర్మిద్దామా.. భాగస్వాముల్ని చేర్చుకుందామా.. లేక వేరే వాళ్లకే సినిమాను ఇచ్చేద్దామా అని యోచిస్తున్నట్లు సమాచారం. ఏ విషయం ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English