బాడీషేమింగ్.. ఇద్ద‌రు హీరోయిన్ల ఆక్రోశం

బాడీషేమింగ్.. ఇద్ద‌రు హీరోయిన్ల ఆక్రోశం

ఒక‌సారి గ్లామ‌ర్ ఫీల్డ్ లోకి వ‌చ్చాక అమ్మాయిల్ని జ‌నాలు ఎలా చూస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వ‌య‌సు పెరుగుతున్నా.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఎన్నేళ్ల‌యినా.. వాళ్లు నాజూగ్గా క‌నిపించాల్సిందే. గ్లామ‌ర్ కాపాడుకోవాల్సిందే. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. దాని గురించి డిస్క‌ష‌న్లు మొద‌లైపోతాయి. కామెంట్లు ఎదుర‌వుతాయి. ఐతే ఈ డిస్క‌ష‌న్లు, కామెంట్లు శ్రుతి మించితేనే క‌ష్టం. వ్య‌వ‌హారం బాడీ షేమింగ్ వ‌ర‌కు వెళ్తే హీరోయిన్లు త‌ట్టుకోలేరు.

ఇప్పుడు ట్రెండ్ మారి.. హీరోయిన్లు ఏ విష‌యంపై అయినా స్వేచ్ఛ‌గా మాట్లాడేస్తున్న నేప‌థ్యంలో త‌మ‌కు ఎదుర‌య్యే కామెంట్ల విష‌యంలో వాళ్లేమీ ఊరుకోవ‌ట్లేదు. తాజాగా ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌ల‌కు బాడీ షేమింగ్ కామెంట్లు ఎదురు కాగా.. ఆ ఇద్ద‌రూ కొంచెం తీవ్రంగానే స్పందించారు. ఇటీవ‌లే బిడ్డ‌కు త‌ల్లి అయిన నేహా ధూపియా ఈ క్ర‌మంలో షేప‌వుట్ అయింది. దీని మీద ఒక వెబ్ సైట్ ఒక క‌థ‌న‌మే రాసేసింది. ఇక కెరీర్ ఆరంభం నుంచి బొద్దుగానే క‌నిపిస్తూ వ‌చ్చిన విద్యాబాల‌న్‌కు సైతం ఇటీవ‌ల వెయిట్ గురించి కామెంట్లు ఎదుర‌య్యాయి. దీంతో ఆ ఇద్ద‌రూ కొంచెం ఘాటుగా స్పందించారు.

‘బాడీ షేమింగ్‌’ కామెంట్లు త‌న‌ను కొద్దిగా కూడా బాధించవని.. కానీ దీని గురించి కామెంట్లు చేయ‌డం పెద్ద సమస్యగా మారింద‌ని.. సెలబ్రిటీలనే కాదని.. మిగిలిన వారిని కూడా బరువు, అందం విషయంలో అవమానించేలా మాట్లాడొద్ద‌ని నేహా అంది. తాను ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చాన‌ని.. అయిన‌ప్ప‌టికీ ఫిట్నెస్ సాధించేందుకు ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్నాన‌ని.. అది త‌న బిడ్డ కోస‌మే అని.. అంతే త‌ప్ప సమాజానికి అందంగా కనపడటానికి తాను ఫిట్ కావాల‌ని భావించ‌ట్లేద‌ని.. ద‌య‌చేసి బాడీ షేమింగ్ కామెంట్లు చేయొద్ద‌ని నేహా అంది. ఆమె ట్వీట్ మీద చాలామంది సెల‌బ్రెటీలు చాలా సానుకూలంగా స్పందించారు. శ‌భాష్ నేహా అన్నారు.

మ‌రోవైపు త‌న బాడీ గురించి త‌ర‌చుగా వ‌చ్చే కామెంట్ల‌పై విద్యాబాల‌న్ స్పందిస్తూ.. త‌న‌కు చిన్న‌ప్ప‌ట్నుంచి హార్మోన్‌ సమస్యలున్నాయని.. అందుకే బరువు పెరుగుతున్నానని.. బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆశించిన ప‌లితం లేద‌ని అంది. ఐతే త‌న ఆహార్యం చూసి.. తాను అస‌లు వ్యాయామాలు చేయనని కొందరు నన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటార‌ని.. కానీ అది త‌ప్ప‌ని.. బరువు తగ్గించుకోవడానికి తాను ఎంత కష్టపడతానో ఎవ‌రికీ తెలియ‌ద‌ని చెప్పింది. గత కొన్నాళ్లుగా త‌న‌ ఫొటోలను చూసుకోవడం మానేశానని.. అవి చూసినప్పుడల్లా ఇప్పుడు తాను ఇంకా బరువు పెరిగాననే బాధ త‌న‌ను వేధిస్తోంద‌ని.. అయిన‌ప్ప‌టికీ తాను ఇప్పుడు బ‌రువు త‌గ్గ‌డం కంటే.. ఆరోగ్యం మీదే దృష్టిపెడుతున్నాన‌ని విద్యా చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English