జనాలు థియేటర్లకు పరుగులు పెట్టారు

జనాలు థియేటర్లకు పరుగులు పెట్టారు

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడేం మాట్లాడతాడో అర్థం కాదు. చాలా ఓపెన్‌గా, నిజాయితీగా మాట్లాడుతున్నట్లే కనిపిస్తాడు కానీ.. కొన్నిసార్లు ఆయన మాటలు మరీ అతిశయంగా ఉంటాయి. నమ్మశక్యం కావు. గత కొన్నేళ్లలో ఇలా అతిశయోక్తి మాటలు మాట్లాడి మాట్లాడి క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టుకున్నాడాయన. తాజాగా తన శిష్యుడైన అజయ్ భూపతి గురించి వర్మ చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

నిన్ననే విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వర్మ శిష్యుడు. ఈ చిత్రానికి సంచలన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే వర్మ పొంగిపోయాడు. తన శిష్యుడి గురించి గొప్పగా మాట్లాడాడు. ఇక నిన్న ‘ఆర్ఎక్స్ 100’ రిలీజ్ సందర్భంగా వర్మ దాని వరుసగా ట్వీట్లు గుప్పించాడు.

జనాలు ఈ సినిమా చూడ్డానికి ఎగబడుతున్నట్లు ఉదయం ట్వీట్ చేసిన వర్మ.. సాయంత్రం ఈ చిత్రం సంచలన ఓపెనింగ్స్ తెచ్చుకున్నట్లు చెప్పాడు. ఇది చూసి అజయ్ భూపతికి నాలుగు టాప్ బేనర్లు అడ్వాన్సులు ఇచ్చినట్లుగా తెలిసిందని ట్వీట్ చేశాడు. తన అసిస్టెంటుగా పని చేసిన అజయ్.. తన తర్వాత సినిమాకు తనను అసిస్టెంటుగా చేర్చుకోవాలని వర్మ చమత్కరించడం విశేషం. మరి వర్మ అన్నట్లుగా నిజంగా నాలుగు టాప్ బేనర్లు అజయ్‌కి అడ్వాన్సులిచ్చేశాయా అన్నది చూడాలి.

‘ఆర్ఎక్స్ 100’కు టాక్ డివైడ్‌గా ఉన్నప్పటికీ దీనికి ఓపెనింగ్స్ మాత్రం ఊహించని స్థాయిలో వచ్చిన మాట వాస్తవం. పెట్టుబడి మీద కొన్ని రెట్లు ఈ చిత్రం వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనుకోకుండా మంచి హైప్ వచ్చి జనాలు థియేటర్లకు పరుగులు పెట్టారు. ఐతే సినిమాలో అసలు విషయం కంటే.. పోస్టర్లలో చూపించిన బోల్డ్ కంటెంటే యువతను ఎక్కువ ఆకర్షిస్తున్న మాట వాస్తవం. ఆమాత్రానికే అజయ్‌కి అన్ని ఆఫర్లు వచ్చేస్తాయా అన్నది డౌట్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు