విజయేంద్ర ప్రసాద్ సినిమా.. అతనే హీరో

విజయేంద్ర ప్రసాద్ సినిమా.. అతనే హీరో

‘బాహుబలి’తో బాలీవుడ్లోనూ రచయితగా గొప్ప పేరు సంపాదించారు విజయేంద్ర ప్రసాద్. ఆ సినిమా పూర్తి కాకముందే ‘భజరంగి భాయిజాన్’కు కథ అందించిన ఆయన.. ఆ సినిమాతోనూ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి విజయేంద్రకు పెద్ద ఆఫర్లే వచ్చాయి. అందులో ఆర్ఎస్‌ఎస్ మహా ప్రస్థానంపై తీయబోయే సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి కథ విజయేంద్ర ప్రసాదే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావస్తోంది. కొన్ని నెలలుగా ఆర్ఎస్‌ఎస్ ప్రముఖులను కలుస్తూ.. ఆ సంస్థ కార్యకలాపాల్ని పరిశీలిస్తూ.. చరిత్రను తిరగేస్తూ.. స్క్రిప్టు రెడీ చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్. ఎట్టకేలకు ఆ పని ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుందట.

‘ఆర్ఎస్ఎస్ భగ్వా’ పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు అక్షయ్ కుమార్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లలో దేశభక్తి.. సామాజిక బాధ్యతతో ముడిపడ్డ సినిమాలు చాలానే చేశాడు అక్షయ్. ‘రుస్తుమ్’.. ‘ఎయిర్ లిఫ్ట్’.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. ‘ప్యాడ్ మ్యాన్’ ఈ కోవలోని సినిమాలే. అతను బీజేపీకి మద్దతుదారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్షయ్‌ని ఆర్ఎస్ఎస్ సినిమాకు అడిగినట్లు తెలుస్తోంది. అతను కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఆర్ఎస్ఎస్.. భారతీయ జనతా పార్టీల ఆర్థిక సహకారంతో ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనునారట. ఆర్ఎస్‌ఎస్ స్థాపన నుంచి దాని ఎదుగుదల.. ఇప్పటి పరిస్థితుల వరకు అన్నీ ఇందులో చూపిస్తారని సమాచారం. ఏదో డాక్యుమెంటరీ లాగా కాకుండా పూర్తి స్థాయి సినిమాలాగానే దీన్ని తీర్చిదిద్దుతారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు