డీజే.. నా పేరు సూర్య.. ఎంత తేడా?

డీజే.. నా పేరు సూర్య.. ఎంత తేడా?

గత ఏడాది విడుదలైన అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’కు అప్పట్లో ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలిసిందే. ‘వరుడు’ తర్వాత బన్నీ సినిమాల్లో ఎక్కువ నెగెటివ్ టాక్ వచ్చింది ఈ చిత్రానికే. కానీ ఆ టాక్‌తో సంబంధం లేకుండా దానికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఓపెనింగ్ వీకెండ్లో బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు ఈ చిత్రానికే వచ్చాయి.

ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘డీజే’ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో రూ.18 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం రేపింది. అంత డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా అంత షేర్ రాబట్టడం ఆశ్చర్యమే. అది చూసి బన్నీ బాక్సాఫీస్ స్టామినా గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాతోనూ బన్నీ ఎలా ప్రభంజనం సృష్టించాడో చూశారా అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు.

కానీ ఇప్పుడు ‘నా పేరు సూర్య’ చిత్రానికి నైజాంలో వచ్చిన వసూళ్లు చూస్తే షాకవ్వాల్సిందే. ఈ చిత్రం అక్కడ ఫుల్ రన్లో రూ.10.5 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. నిజానికి ‘డీజే’తో పోలిస్తే దీనికి టాక్ బెటర్‌గానే వచ్చింది. సినిమా చెత్తేమీ కాదు. ఇలాంటి సినిమాకు ఇంతే షేర్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఓపెనింగ్ వీకెండ్లోనే అంతంతమాత్రంగా నడిచిన ఈ చిత్రం.. ఆ తర్వాత చాలా నామమాత్రంగా నడిచింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లేమీ దీనికి కలిసి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో.. యుఎస్‌లో కూడా ‘నా పేరు సూర్య’ నష్టాలే మిగిల్చింది.

కానీ నైజాంలో పరిస్థితి మరీ దారుణం. అమెరికాలో వరుసగా మూడో సినిమాతోనూ బయ్యర్లకు పెద్ద ఎత్తునే మిగిల్చాడు బన్నీ. ‘నా పేరు సూర్య’ అన్ని రకాలుగా బన్నీకి ఒక హెచ్చరిక అయింది. తర్వాతి సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టక తప్పని స్థితిలో ఉన్నాడు అల్లు హీరో. మరి ఈసారి అతనెలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు