‘భరత్ అనే నేను’ వెనుక ఆ దర్శకుడు

‘భరత్ అనే నేను’ వెనుక ఆ దర్శకుడు

శ్రీహరి నాను.. ఈ పేరెక్కడైనా విన్నట్లుందా? గతంలో భూమిక కథానాయికగా ‘సత్యభామ’ అనే సినిమా ఒకటి వచ్చింది గుర్తుందా? ఆ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఇతనే. ఆ సినిమా ఆడకపోయినా శ్రీహరి పనితీరు నచ్చి అతడి దర్శకత్వంలో భూమిక ‘తకిట తకిట’ అనే సినిమా కూడా నిర్మించింది. అది కూడా ఆడలేదు. శ్రీహరి అంతకుముందు.. తర్వాత కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశాడు. ఐతే పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత అతడి పేరు వార్తల్లోకి వచ్చింది. కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’కు మూల కథ అందించింది అతనే. ఇన్నాళ్లూ తెర మరుగున ఉండిపోయిన అతడిని ఈ చిత్ర సక్సెస్ మీట్లో వెలుగులోకి తెచ్చాడు కొరటాల.

తెలుగు పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ రచయితల్లో శ్రీహరి నాను ఒకడని కొరటాల కితాబిచ్చాడు. మహేష్ బాబు కోసం ఎలాంటి కథ రాయాలి అనుకున్నపుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుందని అనుకున్నానని.. అప్పుడే శ్రీహరి నాను మహేష్‌ను సీఎం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ నేపథ్యంలోనే కథ రాసి ఇచ్చాడని చెప్పాడు. శ్రీహరి ఏ కథ రాసినా మహేష్ బాబును దృష్టిలో ఉంచుకునే రాస్తాడని.. అలాంటి గొప్ప నటుడి కోసం కథ అంటే ఇన్‌స్పిరేషన్ వచ్చి మరింత బాగా రాస్తానని అతడి నమ్మకమని కొరటాల చెప్పాడు. శ్రీహరితో కలిసి పని చేయడం చాలా మంచి అనుభవమని.. తమ ఇద్దరి కాంబినేషన్లో మున్ముందు మరిన్ని మంచి కథలు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పాడు కొరటాల. ‘భరత్ అనే నేను’ కథను కొరటాల రూ.కోటికి కొన్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English