ముందు చైతూ.. తర్వాత నితిన్.. ఆపై సూర్య

ముందు చైతూ.. తర్వాత నితిన్.. ఆపై సూర్య

తెలుగులో ‘ఇష్టం’ అనే సినిమాతో తన ప్రస్థానాన్ని ఆరంభించాడు విక్రమ్ కుమార్. ఆ సినిమా ఆడలేదు. దీంతో తర్వాత తన సొంత గడ్డ తమిళంలోకి వెళ్లి శింబు హీరోగా ‘అలై’ తీశాడు. అదీ ఫ్లాపే. ఐతే తమిళం-హిందీ భాషల్లో తీసిన ‘13 బి’ అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. ఐతే ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని.. ఆశ్చర్యకరంగా తిరిగి తెలుగులోకి వచ్చి ‘ఇష్క్’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు విక్రమ్. ఇష్క్ పెద్ద హిట్టయింది. తర్వాత ‘మనం’.. ‘24’.. ‘హలో’ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు విక్రమ్. ఇప్పుడు విక్రమ్ తర్వాతి సినిమాలపై జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంది.

ఈ నేపథ్యంలో తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఒక క్లారిటీ ఇచ్చాడు విక్రమ్. నాగార్జున కోరినట్లే ఆయన పెద్ద కొడుకు నాగచైతన్యతో తన తర్వాతి సినిమా చేయబోతున్నాడట విక్రమ్. ఆ సినిమా మొదలవడానికి నాలుగైదు నెలలు పట్టొచ్చన్నాడు. దీని తర్వాత ‘ఇష్క్’ హీరో నితిన్‌తో ఓ సినిమా చేస్తానన్నాడు. ఆపై మళ్లీ ‘24’ సినిమా చేసిన సూర్యతోనూ ఒక సినిమా చేయబోతున్నట్లు విక్రమ్ వెల్లడించాడు. ‘24’ సమయంలోనే మళ్లీ కలిసి ఓ సినిమా చేద్దామని తాను, సూర్య అనుకున్నామని.. ఆ తర్వాత రెండు మూడు మీటింగ్స్ కూడా జరిగాయని.. ఐతే సూర్యను ఓ కథతో ఒప్పించడం అంటే అంత సులువైన విషయం కాదని.. తన మైండ్‌లో సూర్య కోసం ఎఫ్పుడూ ఐడియాలు మెదులుతూనే ఉంటాయని.. త్వరలో మంచి కథ చెప్పి సూర్యతో సినిమా ఓకే చేయించుకుంటానని విక్రమ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు