అటు రాజమౌళి.. ఇటు నాని

అటు రాజమౌళి.. ఇటు నాని

'నేనింతే' సినిమాలో నిర్మాత పాత్ర చేసిన షాయాజి షిండే ఒక సీన్లో చాలా ఆవేదనగా ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కేవలం రెండు శాతం అని చెబుతాడు. అది కొంచెం అతిగా అనిపించొచ్చు కానీ.. మిగతా ఏ ఫీల్డ్‌తో పోల్చుకున్నా ఇక్కడ సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ అన్నది మాత్రం వాస్తవం.

ఏ ఏడాది కూడా 10-15 శాతానికి మించి సక్సెస్ రేట్ ఉండదిక్కడ. వంద సినిమాలు రిలీజైతే.. లాభాలు తెచ్చిపెట్టేవి 10 శాతానికి అటు ఇటు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నిలకడగా విజయాలు సాధించడం అన్నది చాలా చాలా కష్టం. ఓ దర్శకుడైనా.. నిర్మాత అయినా.. హీరో అయినా.. ఇంకెవరైనా కూడా వరుసగా మూణ్నాలుగు హిట్లు కొడితే ఎక్కువ. కానీ ఇక్కడ కూడా జాగ్రత్తగా అడుగులేస్తూ వరుస విజయాలు సాధించే వాళ్లు కొందరుంటారు.

అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రాజమౌళిదే. కెరీర్లో ఇప్పటిదాకా అపజయం అన్నదే లేదు రాజమౌళి కెరీర్లో. సినిమా సినిమాకూ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ఒకదాన్ని మించి ఒకటి హిట్టు కొడుతూ కెరీర్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. ఇలాంటి ట్రాక్ రికార్డు తెలుగు సినీ చరిత్రలోనే ఇంకెవరికీ లేదంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు హీరోల్లో నాని కూడా అరుదైన ట్రాక్ రికార్డుతో సాగిపోతున్నాడు. రెండేళ్ల కిందట 'ఎవడే సుబ్రమణ్యం'తో మొదలుపెట్టి వరుసగా విజయాలందుకుంటున్నాడు నాని.

దీని తర్వాత భలే భలే మగాడివోయ్.. కృష్ణగాడి వీర ప్రేమగాథ.. జెంటిల్ మన్.. మజ్ను.. నేను లోకల్ రూపంలో విజయాలందుకున్నాడు నాని. వీటిలో 'మజ్ను' ఒక్కటే పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదు. కానీ పెట్టుబడి మాత్రం వెనక్కి తెచ్చింది. 'నేను లోకల్'తో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన నాని.. లేటెస్టుగా 'నిన్ను కోరి'తో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ట్రిపుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టాడు. తనకు గాడ్ ఫాదర్‌ లాంటి రాజమౌళి బాటలోనే ప్రతి సినిమాకూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ నాని విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తుండటం గొప్ప విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు