చిన్న సినిమా.. షాకిచ్చేలా ఉందే

చిన్న సినిమా.. షాకిచ్చేలా ఉందే

అప్పుడప్పుడూ కొన్ని చిన్న సినిమాలు అనూహ్యమైన ఫలితాన్ని రాబడుతుంటాయి. ఆ సినిమాల ప్రోమోలు చూస్తేనే ఇదేదో ప్రత్యేకంగా ఉందే అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఉయ్యాల జంపాల.. క్షణం.. పెళ్లిచూపులు సినిమాలు ఇలాగే తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచి.. మంచి విజయం సాధించాయి. 'పిట్టగోడ' కూడా ఆ కోవలోకి చేరేలా కనిపిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ పోస్టరే వెరైటీగా కనిపించింది. ఆ తర్వాత టీజర్ ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చింది. పాటలు కూడా కొత్తగా.. ఆహ్లాదంగా ఉన్నాయి. అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల లాంటి సినిమాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించడం.. సురేష్ బాబు భాగస్వామ్యం కూడా ఉండటంతో ఈ చిత్రంలో ఏదో ప్రత్యేకత ఉందనే అనిపిస్తోంది. పైగా క్రిస్మస్ వీకెండ్లో మూడు సినిమాలు పోటీలో ఉన్నా సరే.. ధైర్యంగా రిలీజ్ చేసేస్తున్నారు. దీన్ని బట్టి సినిమా మీద కాన్ఫిడెంటుగా ఉన్న సంగతి అర్థమవుతోంది. 'పెళ్లిచూపులు' తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు చూపించారట. వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా బాగుందట.

ఈ నేపథ్యంలో 'పిట్టగోడ' సర్ప్రైజ్ హిట్ అయ్యే అవకాశాల్ని కొట్టి పారేయలేం. రిలీజ్ ముంగిట పబ్లిసిటీ కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. విశ్వనాథ్ రాచకొండ- పునర్ణవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో అనుదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'ప్రాణం' కమలాకర్ సంగీతాన్నందించాడు. ఈ శనివారమే 'పిట్టగోడ' ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు