చాలా మీడియా సంస్థలు పెద్దగా కవర్ చేయని ముఖ్యమైన వార్తల్లో ఇదొకటిగా చెప్పాలి. కీలకమైన ఒక తీర్పునకు సంబంధించిన వార్తలు మీడియా సంస్థల్లో పెద్దగా కనిపించకపోవటం గమనార్హం. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్సు చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావు మీద ఆరోపణల సంగతి తెలిసిందే. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటం.. అందుకు సంబంధించిన ఆరోపణలతో ఆయన సస్పెండ్ కావటం తెలిసిందే. సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆయనపై వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణలో భాగంగా తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ జరిపిన కోర్టు.. తాజాగా ఆయన పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తన ఆదేశాల్ని జారీ చేస్తే.. ఒకవేళ ఏబీ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయాల్సివస్తే.. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని పాటించాలని.. అందులో పేర్కొన్నట్లుగా నడుచుకోవాలని పేర్కొంది.
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారాన్ని ఏబీ పర్యవేక్షిస్తూ వచ్చినట్లుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కొనుగోళ్లలో ఏబీ స్వీయ ప్రయోజనాలు దాగి ఉన్నట్లుగా అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ కాంట్రాక్టును ఏబీ తన కుమారుడికి కట్టబెట్టి లబ్ధి చేకూర్చారన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా బయటపెట్టలేదన్నారు. సీనియర్ అధికారులు వద్దని చెప్పినా వినకుండా నిఘా పరికరాల డీల్ లో ముందుకు వెళ్లినట్లుగా విమర్శలు ఉన్నాయి. దీంతో.. ఈ కేసు విచారణ రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు తెర తీసినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates