టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ఒక్క తిరుమల మాత్రమే అపవిత్రం కాలేదని.. అన్ని ఆలయాలు అపవిత్రమయ్యాయని విమర్శించారు. ఎక్కడా పవిత్రత అన్నమాటే లేకుండా పోయిందన్నారు. ప్రసాదాల నుంచి అన్న సంతర్పణల వరకు అన్నీ అపవిత్రంగానే సాగాయని చెప్పారు.
విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి చెందిన రథం గుర్రాల బొమ్మలను అపహరించినప్పుడు వైసీపీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం శిరచ్ఛేదం జరిగినప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదన్నారు. అన్నవరం సత్య నారాయణ స్వామి ఆలయంలో ప్రసాదం కల్తీ అయిందని, ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆలయంలోనూ పవిత్రత, సంప్రదాయం, శాస్త్రాన్ని పాటించలేదన్నారు.
“తిరుమలలో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్నారు. కేకులు కోశారు. పుట్టిన రోజు వేడుకలను అమెరికన్ సంప్రదాయంలో చేసుకున్నారు. ఇవన్నీ పవిత్రమా? ఒక్క తిరుమలే కాదు.. రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆలయాలను వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలన భ్రష్టు పట్టించింది” అని అశోక్ గజపతిరాజు అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టడం.. వెనుక ఆదేవుళ్ల ఆశీస్సులు ఉన్నాయన్నారు.
అదేవిధంగా జగన్ 11 స్థానాలకు పరిమితం కావడం వెనుక దేవుళ్ల ఆగ్రహం ఉందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. కాగా.. సోమవారం.. విజయనగరం జిల్లాలోనే కాక.. ఉత్తరాంధ్రలోఘనంగా చేసుకునే సిరిమానోత్సవ వేడుకలను మాజీ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగానే ఆయన ఆలయాల గురించి.. వైసీపీ పాలన గురించి వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates