“బాబు బ్రాండు” ప్ర‌పంచ వ్యాప్తం

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ్రాండు ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపిస్తోంద‌ని టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా ఆయ‌న మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన కియా కార్ల షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పాల‌న‌, పెట్టుబడులు, ప్ర‌పంచ స్థాయి సంస్థ‌ల రాక వంటి కీల‌క విష‌యాల‌పై మీడియాతో మాట్లాడారు. “ఎక్క‌డికి వెళ్లినా.. ఎవ‌రిని క‌లుసుకున్నా.. చంద్ర‌బాబు బ్రండ్ గురించే వారు చెబుతున్నారు” అని చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం కియా కార్లు.. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల‌కు కూడా ఎగుమ‌తి అవుతున్నాయ‌ని.. నారా లోకేష్ చెప్పా రు. ఆయా రాష్ట్రాల్లో కూడా చంద్ర‌బాబు పేరు మార్మోగుతోందని తెలిపారు. “ఇటీవ‌ల ఢిల్లీకి వెళ్లా. అక్క‌డ కూడా కియా కార్లు క‌నిపించాయి. మన వాళ్లే కొన్నారు. వారు స్వ‌యంగా వ‌చ్చి నాకు చెప్పారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఏర్పాటు చేసిన కంపెనీ నుంచి కొన్నాం అన్నారు” అని పేర్కొన్నారు. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక సంస్థ‌లు ఏపీకి క్యూక‌ట్టాయ‌ని చెప్పారు.

లూలూ.. రిల‌య‌న్స్ స‌హా టాటా వంటి ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీల నుంచి పెట్టుబ‌డులు రానున్నాయ‌ని వివ రించారు. అదేవిధంగా గ‌త వైసీపీ పాల‌న‌తో విసిగిపోయి.. వైసీపీ నేత‌ల వేధింపుల కార‌ణంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన‌.. అనేక కంపెనీలు కూడా ఇప్పుడు ఏపీకి తిరిగి వ‌స్తున్నాయ‌ని చెప్పారు. పెట్టుబ‌డు ల‌కు రాష్ట్రాన్ని స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని లోకేష్ తెలిపారు. ఎక్కడి వెళ్లినా ఏపీ అంటే.. చంద్రబాబు నాయుడి రాష్ట్రం అంటున్నారని చెప్పారు. ఇది బాబుపై ఉన్న విశ్వసనీయత, నమ్మకానికి అద్దం ప‌డుతోంద‌ని తెలిపారు.

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పెట్టుబ‌డి!

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ర‌కాలైన పెట్టుబ‌డులు పెట్టి… అభివృద్ధి చేసేందుకు చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్నార‌ని నారా లోకేష్ చెప్పారు. రాయ‌ల‌సీమ‌లో త‌యారీ రంగాన్ని(మాన్యుఫాక్ఛ‌రింగ్‌) అభివృద్ధి చేయ‌నున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ఆక్వా, పెట్రో కెమికల్స్‌ సంస్థలను, ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సేవ‌ల రంగాన్ని ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.