వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాట్లాడితే.. రెడ్ బుక్.. రెడ్ బుక్ అంటూ భయాందోళనలను కలిగిస్తోందన్నారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదని.. అధికారం ఇచ్చింది వేధించేందుకు కాదని చెప్పారు. తాము త్వరలోనే గుడ్ బుక్ ఏర్పాటు చేయనున్నట్టు జగన్ చెప్పారు. ప్రస్తుతం మంచి చేస్తున్న అధికారుల పేర్లు ఆ గుడ్‌బుక్‌లో రాసుకుంటామని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సదరు అధికారులకు ప్రమోషన్ కల్పించి.. ప్రజలకు పరిచయం చేస్తామని.. వారి పేరు చిరస్థాయిగా ఉండేలా చూస్తామని చెప్పారు.
ఏ పార్టీ అయినా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. కష్టాలు తప్పవని జగన్ చెప్పారు. అయితే, కష్టాలకు ఓర్చుకుని, దెబ్బలు తిని ముందుకు సాగినప్పుడే హీరోలు పుడతారని, నిలబడతారని, నాయకులు పుడతారని గుర్తింపు పొందుతారని అన్నారు. తద్వారా.. వైసీపీ నుంచి వెళ్లిపోతున్న నాయకులకు జగన్ చెప్పకనే హితవు చెప్పారు. ఇక, రెడ్ బుక్.. రెడ్ బుక్ .. అంటున్నారు. రెడ్ బుక్ పెద్దపనా.. గుడ్ బుక్ పెట్టు. మంచి చేసిన వారికి గుర్తింపు ఇవ్వు. మేం గుడ్ బుక్ పెడతాం. మంచి చేసిన వారి పేర్లు అందులో రాస్తాం. మేం అధికారంలోకి రాగానే వారికి ప్రమోషన్లు కల్పిస్తాం అని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చెప్పేవి.. చేసేవి అన్నీ కూడా మోసాలేనని జగన్ విమర్శించారు. ఈమాదిరిగా ఎప్పుడు ఏ ప్రభుత్వం వ్యవహరించలే దన్నారు. కానీ, ఇప్పుడు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు కాలర్ ఎగరేసి.. ప్రజలకు మంచి చేసే పనులు చేపడతామని జగన్ చెప్పారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. దీంతో ఇక్కడి వైసీపీ కేడర్‌కు పార్టీ తరఫున బలమైన భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నట్టు జగన్ చెప్పారు.
తాజాగా ఆయన మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కీలక నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ప్రజలు మంచి చేశామని.. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను కూడా అమలు చేశామని పేర్కొ న్నారు. అయినా.. ఓడిపోయామని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని జగన్ చెప్పారు. అయినా.. పార్టీ కోసం పనిచేస్తున్నారని, వారందరికీ భరోసా కల్పిస్తామని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates