ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక దాని తర్వాత..ఒకటి ఆయన సంచల న కామెంట్లతో మీడియా మీటింగ్‌ను హీటెక్కించారు. జమిలికి జై కొడుతున్నామని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ఇప్పుడు తనను చంపాలని కుట్రపన్నినట్టు తనకు తెలిసిందని.. దీనిపైనే ఎక్కువగా బయట ప్రచారం కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్నప్పుడు.. తనను చంపేందుకు ప్రయత్నించారని తమ నాయకులు చెప్పారన్నారు. అంతేకాదు.. తన కన్నా వైసీపీ బాధితుడు ఎవరున్నారో చెప్పాలని టీడీపీ నాయకులను ఆయన ప్రశ్నించారు.
`53 రోజులపాటుజైల్లో నిర్బంధించారు. కనీసం మంచి నీళ్లు కూడా సరిగా ఇవ్వలేదు. ఒక్కొక్కసారి బోర్ వాటర్ ఇస్తున్నారని అనిపించింది. ఆహారం తెచ్చినా.. కూడా సరిగా సమయానికి ఇవ్వలేదు. జైలుపై డ్రోన్లు కూడా ఎగురవేశారు. నన్ను చంపాలని చూశారనే ప్రచారం కూడా జరిగింది. మా వాళ్లే చెప్పారు. మీడియా కూడా రాసింది. నా ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా పెట్టారు. ఇవేంటని అడిగితే ఎవరూ స్పందించలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానన్న గౌరవం లేకుండా కొందరు వ్యవహరించారు. కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు. దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర లేదు“ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇంత అనుభవించినప్పటికీ.. తాను బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. అయితే.. తనది కక్ష తీర్చుకునే స్వభావం కాదన్నారు. కానీ, తప్పులు చేసిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదన్నారు. చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని చంద్రబాబు చెప్పారు. ఇక, ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లడం వల్లే పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పారు. ఇంకా తమ ప్రయత్నం మేం చేస్తూనే ఉంటామన్నారు. త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేపడతామని, పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు.
గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది తానేని, ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాలని పరోక్షంగా ఆయన పదవులు ఆశిస్తున్నవారిని హెచ్చరించారు. అయితే.. గత ఐదేళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు తనకు తెలుసునని, అందరికీ న్యాయం జరుగుతుందని కాకపోతే.. కొంచెం ఓపిక పట్టాలని వ్యాఖ్యానించారు. ఎవరు ఏం చేస్తున్నారో.. ఎలా ఉన్నారో.. అని ప్రతిసారి సర్వేల రూపంలో సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలిపారు.