2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల విషయంలో ఏం జరిగిందో తెలీదని, కానీ, ఆధారాలు లేవని జగన్ అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈవీఎంల వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
ఏపీ లాగానే హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభల్లోని సభ్యులు ముందుకు రావాలని, ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ల వినియోగంపై ఆలోచించాలని కోరారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని. ఏపీలో కూడా హర్యానా మాదిరి ఫలితాలే వచ్చాయని అన్నారు. ఇక, నారా లోకేష్ మాదిరి రెడ్ బుక్ మెయింటైన్ చేయడం తమకు పెద్ద పని కాదని, కానీ దాంతోపాటు తాము గుడ్ బుక్ కూడా మెయింటైన్ చేస్తామని జగన్ చెప్పారు. వైసీపీ కోసం కష్టపడిన నేతల పేర్లను ఆ గుడ్ బుక్ లో రాసుకుంటామని అన్నారు.
అంతేకాదు, రాబోయ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ ప్రమోషన్లు, పదవులు ఇస్తామని జగన్ ప్రకటించారు. లోకేష్ రెడ్ బుక్ అని విష సంస్కృతికి బీజం వేశారని, ఇప్పుడు తాను చేయొద్దని చెప్పినా వైసీపీ నేతలు వినే పరిస్థితులు లేవని, అన్యాయం చేసిన పేర్లు, అటువంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని జగన్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులున్నాయని, పార్టీ కార్యకర్తలను పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates