తీరు మార్చుకుంటానన్న కొలికపూడి?

తిరువూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కొంతకాలంగా పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్న సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ తో శ్రీనివాసరావుకు విభేదాలు రావడంపై కూడా టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే శ్రీనివాసరావుపై, ఆయన తీరుపై తిరువూరులోని పలువురు టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

ఈ క్రమంలోనే ఈ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరావుతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, సత్యనారాయణ రాజు కూడా పాల్గొన్నారు. తిరువూరు టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై, ఆయనపై వస్తున్న ఆరోపణలపై శ్రీనివాసరావు నుంచి వివరణ తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన వల్ల జరిగిన పొరపాటును శ్రీనివాసరావు అంగీకరించినట్లు తెలుస్తోంది. తన పనితీరు వల్ల పార్టీలో సమన్వయ లోపం ఏర్పడిందని ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రతినిధులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తన వల్ల వచ్చిన ఇబ్బందులను పరిష్కరించుకుంటానని పార్టీ పెద్దలకు శ్రీనివాసరావు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, మీడియా ప్రతినిధులపై కూడా నోరు జారిన శ్రీనివాసరావు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. మరి, శ్రీనివాసరావు విజ్ఞప్తి ప్రకారం ఆయనతో కలిసి పనిచేసేందుకు టిడిపి అసంతృప్త నేతలు అంగీకరిస్తారా లేదా, కొలికపూడి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా లేదా అన్న సంగతి తేలాల్సి ఉంది.