గతంలో కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మారుస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్. తాజాగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబును ఒక వినతి చేశారు.
గత ప్రభుత్వం అవగాహన లేని కారణంగా వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చిన నేపథ్యంలో.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ గెజిట్ విడుదల చేయాలని పేర్కొన్నారు. దీనికి ఆయన తగిన లాజిక్ చెప్పటం గమనార్హం.
రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తన మాదిరి తిరుమల క్షేత్రానికి వెళ్లలేని నిస్సహాయుల కోసం తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని కడపలో ప్రతిష్ఠించారు. అప్పటినుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు మొదట దేవుని కడపలో దర్శనం చేసుకోవటం ఒక ఆచారంగా మారింది. ఇంతటి ఘన చరిత్ర కడప సొంతమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
అయితే.. గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చింది. ఈ పరిణామంపై శ్రీవారి భక్తుల మనసులు నొచ్చుకున్నాయన్న మంత్రి సత్యకుమార్.. ‘‘భయంతో వారు తమ అభిప్రాయాల్ని బయటకు చెప్పుకోలేదు. అసెంబ్లీలో కూడా నేనీ విషయాన్ని ప్రస్తావించా.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా డెవలప్ మెంట్ కోసం ఎంతో చేశారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. దాని కారణంగా వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలి’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.