నాగార్జున శాంతించ‌లేదు

తెలంగాణ మ‌హిళా మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలు కొండా సురేఖ మ‌రిన్ని ఇబ్బందుల్లో చిక్కు కున్నారు. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని రాజ‌కీయంగా ఆమె రోడ్డుకు లాగేసిన త‌ర్వాత‌.. ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టాలీవుడ్ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు కూడా అనేక మంది ఆమె తీరును ఎండ‌గ‌డుతున్నారు. ముఖ్యంగా నాగార్జున మాజీ కోడ‌లు సమంత‌ను టార్గెట్ చేయ‌డాన్ని చాలా మంది నిర‌సిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సురేఖ త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకున్నారు.

అయినా.. అక్కినేని నాగార్జున శాంతించ‌లేదు. తాజాగా మంత్రి కొండా సురేఖ‌పై ఆయ‌న నాంప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం కేసును దాఖ‌లు చేశారు. స‌హ‌జంగా వివాదాల‌కు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం ఈ విష‌యంలోనూ ముందు.. సెన్సిటివ్‌గానే స్పందించింది. సురేఖ వ్యాఖ్య‌ల తర్వాత‌ అక్కినేని వెంట‌నే తెర‌మీది వ‌చ్చారు. ఇలా చేయ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. మంత్రిగారు త‌మ కుటుంబాన్ని రాజ‌కీయాల్లో కి లాగ‌రాద‌ని కూడా పేర్కొన్నారు.

అంతేకాదు.. రాజ‌కీయాల్లోకి సెల‌బ్రిటీల జీవితాల‌ను లాగొద్ద‌ని కూడా ఆయన అభ్య‌ర్థించారు. అయినా.. ఎక్క‌డో ముల్లు మాదిరిగా సురేఖ వ్యాఖ్య‌లు అక్కినేని కుటుంబాన్ని గుచ్చుతూనే ఉన్నాయి. పైగా సురేఖ వ్యాఖ్య‌లు సీరియ‌స్‌గా ఉండ‌డం.. త‌మ కుటుంబానికి మాయ‌ని మ‌చ్చ‌గా మారుతున్న‌ట్టు భావించారో ఏమో.. నాగార్జున గురువారం.. న్యాయ‌పోరాటానికి దిగారు. మంత్రి సురేఖ‌పై పరువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. ఆమెపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు.

తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పిటిష‌న్‌లో నాగార్జున పేర్కొన్నారు. తాము ఇన్నేళ్లుగా ప‌రువుగా బ‌తుకుతున్నామ‌ని.. స‌మాజంలో త‌మ‌కు ఒక స్టేట‌స్ ఉంద‌ని, ఎన్న‌డూ తాము రాజ‌కీయాల్లోకి రాలేద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. అలాంటి త‌మ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌కు సురేఖ చేసిన వ్యాఖ్య‌ల వీడియో పెన్ డ్రైవ్‌ను కూడా కోర్టుకు స‌మ‌ర్పించారు.