ఒక్క తమిళ ఇంటర్వ్యూతో సరిచేసిన పవన్

ఇటీవలే సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డు గురించి కార్తీ సెన్సిటివ్ టాపిక్ అంటూ నవ్వుతు తప్పించుకోవడం, దానికి పవన్ సీరియస్ గా స్పందించడం, అటు వైపు క్షమాపణ వచ్చి పరస్పరం శుభాకాంక్షలు చెప్పడం జరిగిపోయాయి. ఇక్కడితో కథ అయిపోలేదు.

కార్తీ సారీ చెప్పడం అక్కడి అభిమానులతో పాటు నాజర్ లాంటి కోలీవుడ్ పెద్దలకూ నచ్చలేదు. సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా పవన్ ని టార్గెట్ చేసుకుంటూ పలు ట్విట్టర్ హ్యాండిల్స్ యాక్టివ్ అయ్యాయి. వివాదం సద్దుమణిగిన సరే దానికి మరింత నిప్పులు మరింత రాజేసే ప్రయత్నం జరిగింది.

ఈ డ్యామేజీని ఒక్క తమిళ ఇంటర్వ్యూతో మొత్తం సరిచేశాడు పవన్ కళ్యాణ్. ఒక న్యూస్ ఛానల్ కి గంట నిడివికి దగ్గరగా ఉన్న ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొని తన గురించి అపార్థం చేసుకున్న తమిళ సోదరులకు పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

ఏపి డిప్యూటీ సిఎం అందులోనూ టాలీవుడ్ స్టార్ హీరో కాబట్టి భాష సమస్య వస్తుందని భావించిన యాంకర్ ఇంగ్లీష్ లో ప్రశ్నలు సిద్ధం చేసుకుని వచ్చాడు. కానీ ఊహించని విధంగా పవన్ వీలైనంత వరకు సరళంగా తమిళంలోనే సమాధానం చెప్పడంతో షాక్ అవ్వడం అవతలి వ్యక్తి వంతయ్యింది. పవన్ విషయ పరిజ్ఞానం గురించి విని యాంకర్ ఆశ్చర్యపోయాడు.

సనాతన ధర్మం, విజయ్ లియో, విజయ్ కాంత్ ప్రస్తావన, అన్నా దురై- ఎంజిఆర్ – జయలలిత సంగతులు, యోగిబాబు నటించిన మండేలా, ఎల్టిటిఈ, మధురై మాండలికం వాడడం ఇలా ఎన్నో తమిళులను ఆకట్టుకునే విషయాలు పంచుకున్న పవన్ కళ్యాణ్ లడ్డు కాంట్రావర్సిలో తన స్టాండ్ గురించి స్పష్టంగా వివరించడంలో సక్సెసయ్యాడు.

ఇప్పుడీ వీడియో తాలూకు క్లిప్పులు ఆన్ లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. చెన్నై మీడియా, ఇన్ఫ్లూయన్ సర్లు పవన్ ని పొగుడుతూ ట్వీట్లు చేయడం విశేషం. ఇంటర్వ్యూ బయటికి వచ్చిన టైంలోనే పవన్ తిరుమల పర్యటన చేయడంతో ఎక్స్ మొత్తం ఆయనే కనిపిస్తున్నారు.