తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలు హిందువుల మనో భావాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై సిట్ విచారణ సాగు తోంది. ఇదేసమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనను తీవ్రంగానే పరిగణించింది. ప్రస్తుతం ఈ కేసుపై కూడా విచారణ కొనసాగుతోంది. అయితే.. నెయ్యి కల్తీ ఘటన వ్యవహారంపై నిరసనలు, ప్రజాస్వామ్య యుత ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు.
తిరుమల శ్రీవారి కైంకర్యాలు, ప్రసాదాలు, భోజనాల్లో వినియోగించే నెయ్యిని స్వంతంగానే తయారు చేసు కునేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. స్వయంగా వేయి గోవులు ఇవ్వడంతోపాటు దాతల నుంచి లక్ష గోవులు సమకూరుస్తానని ఆయన ప్రకటించారు. అదేవిధంగా తిరుమల దేవస్థానం సొంత డెయిరీ ఏర్పాటు చేసేందుకు కూడా తాను సహకరిస్తానని తెలిపారు. నెయ్యి వివాదం నేపథ్యంలో బోడే.. తిరుమల పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి తిరుమలకు ఆయన పాదయాత్రగా వచ్చారు.
మంగళవారం ఉదయం శ్రీవారిని తన అనుచరులతో సహా దర్శించుకున్న బోడే.. అనంతరం మీడియా తో మాట్లాడారు. రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీ చేసేందుకు అవకాశం ఉందని.. కానీ, ఈ దిశగా ఎవరూ అడుగులు వేయలేదని అన్నారు. తిరుమల సొంతంగా ఏర్పాటు చేసుకునే డెయిరీలో 10 వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉందన్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన నెయ్యిని సొంతంగా తయారు చేసుకునేందుకు తిరుమలకు అన్ని అవకాశాలూ ఉన్నాయని చెప్పారు.
వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న తిరుమల శ్రీవారికి సొంతంగా డెయిరీ ఏర్పాటు చేస్తే.. ఎలాంటి అపోహలకు, అపార్థాలకు తావులేకుండా.. నెయ్యిని ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. లడ్డు ప్రసాదం సహా, పూజా నెయ్యి కూడా అపవిత్రంగా నిర్వహించవచ్చునని తెలిపారు. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేస్తే.. తన వంతుగా వేయి ఆవులు ఇస్తానన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates