ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, మోపీదేవి వెంకటరమణలు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా ఉన్నా వారు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం మూడు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ మూడు పదవులు దక్కేది ఎవరికి ? చంద్రబాబు దృష్టిలో ఎవరు ఉన్నారు ? అన్న చర్చ జోరుగా నడుస్తున్నది.
కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల నుండి నామినేటెడ్ పదవుల వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కోటా ప్రాతిపదికన చంద్రబాబు పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పదవులు కూడా రెండు టీడీపీ, ఒకటి జనసేనకు అన్న ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల ఎన్నికల్లో సీనియర్ టీడీపీ నేతలు యనమల రామక్రిష్ణుడు, దేవినేని ఉమ, అశోక గజపతి రాజులకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఇద్దరికి టీడీపీ నుండి అవకాశం ఉంటుందని అంటున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక జనసేన తరపున ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్ కు త్యాగం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం లభిస్తుందని తెలుస్తుంది.