జనసేన ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు.. తన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెనుకేసుకు వచ్చారు. హిందూ ధర్మంపై గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు మిశ్రమంగా స్పందించిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ అయిన వ్యవహారంపై పవన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన అప్పట్లో సనాతన ధర్మాన్ని విమర్శించినా.. ధర్మంపై దాడి చేసిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై పలువురు విమర్శలు చేయగా, మరికొందరు పవన్‌ను సమర్ధించారు.
అయితే.. ఆ వ్యవహారంపై ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మరింత మంది సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కల్యాణ్ తొందర పడ్డారని, ఇప్పుడు లడ్డూ కల్తీ అయినట్టుగా ఎలాంటి ఆధారాలూ చూపించలేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కామెంట్లు చేశారు. దీనిపై తాజాగా స్పందించిన నాగబాబు.. పవన్ కల్యాణ్‌ను విమర్శించే వారు.. సూడో సెక్యులర్ లు అని వ్యాఖ్యానించారు. “హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదు” అని పవన్ వ్యాఖ్యానించినట్టు చెప్పు కొచ్చారు. పవన్ చేసిన వ్యాఖ్యలు తప్పు ఎలా అవుతాయన్నారు. సూడో సెక్యులరిస్టులు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇక, మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారంపైనా నాగబాబు స్పందించారు. “డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట. అన్ని మతాలను అందరూ గౌరవించాలి” అని నాగబాబు వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణ కమిటీని కేవలం ఏపీలోనే కాదని.. జాతీయ స్థాయిలో చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని నాగబాబు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని హిందూ ధర్మంపై జరిగిన దాడిగా పేర్కొన్న పవన్ కల్యాణ్.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇది మంగళవారంతో ముగియనుంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్తున్నారు. దీక్షను అక్కడే విరమించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల పోటును పరిశీలించడంతోపాటు.. లడ్డూ తయారీని కూడా తెలుసుకుంటారు. వెంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని కూడా పరిశీలించి.. నాణ్యతపై అధికారులతో సమీక్షించనున్నారు. అదేవిధంగా తిరుమల అన్న ప్రసాదం, లడ్డూ సహా ఇతర ప్రసాదాల నాణ్యతపై తగు సూచనలు చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates