హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా పని తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ‘హైడ్రా ఏర్పాటు అభినందనీయం. పని తీరే అభ్యంతరకరం’ అన్న టీహైకోర్టు.. అవసరమైతే హైడ్రా ఏర్పాటు పైనే స్టే ఇస్తామని హెచ్చరించటం గమనార్హం. ఒక్కరోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవటం సరికాదన్న న్యాయస్థానం.. రాజకీయ నేతలు చెప్పినంతన మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దని పేర్కొంది.
ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నిస్తూ.. “ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా?రాజకీయ నేతలు.. ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు. శని.. ఆదివారాలు.. సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఆదివారం మీరు ఎందుకు పని చేయాలి? సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి.. అత్యవసరంగా కూల్చివేస్తున్నారు? శని.. ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి కదా? కోర్టు తీర్పుల విషయం కూడా తెలీదా?” అని ప్రశ్నించింది.
హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా.. అమీన్ పూర్ తహసీల్దార్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా? చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ తహసీల్దార్ కు వార్నింగ్ ఇచ్చింది. విచారణ వేళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్న మాటలకు అడ్డుకున్న హైకోర్టు.. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలన్నారు.
కూల్చివేతకు యంత్రాలు.. సిబ్బందిని కోరటంతో సమకూర్చామని రంగనాథ్ పేర్కొనగా.. చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు.. సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే.. హైడ్రాకే స్టే ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందన్న హైకోర్టు.. ‘చట్టవిరుద్ధంగా పని చేయొద్దు. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా? ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అధికారులు చట్టవిరుద్ధంగా పని చేస్తే ఇంటికి వెళతారు. జాగ్రత్త’ అంటూ హెచ్చరించింది.
మూసీపై ఇరవై లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని.. ఇది అరుదైన కేసుగా భావించి అధికారులను విచారణకు పిలిచినట్లుగా పేర్కొంది. జీవో ప్రకారం చూస్తే హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని.. మిగిలిన అంశాల్ని పట్టించుకోకుండా కూల్చివేతలపైనే ఫోకస్ పెట్టారని తప్పు పట్టింది. ట్రాఫిక్ సమస్య పైనా హైడ్రాకు బాధ్యత ఉందని.. కానీ దాని గురించి పట్టించుకోవట్లేదన్నారు.
మాదాపూర్ లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా? అని ప్రశ్నిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. సబ్ రిజిస్ట్రాన్ రిజిస్ట్రేషన్ చేస్తేనే సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారని.. స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాల్ని చేపడుతన్నారన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందన్న హైకోర్టు.. ఒక్కరోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవటం సరికాదని పేర్కొంది. ఎప్టీఎల్ నిర్దారించకుండా అక్రమాలు ఎలా తేలుస్తారు? అని ప్రశ్నించింది. ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కోను కంటిన్యూ చేయాలని హైడ్రాను.. అమీన్ పూర్ తహసీల్దార్ ను ఆదేశించింది.