టీడీపీ ఎమ్మెల్యేకి నిర‌స‌న సెగ‌.. ఏం జ‌రిగింది?

ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచి ప‌ట్టుమ‌ని నాలుగు నెల‌లు కూడా కాలేదు. కానీ, న‌లువైపుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. న‌లుచెర‌గులా వివాదాస్ప‌ద నాయ‌కుడిగా మిగిలిపోతున్నారు. ఆయ‌నే టీడీపీ నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కొలికపూడికి చంద్ర‌బాబు ఏరికోరి తిరువూరు టికెట్‌ను ఇచ్చారు. గెలిపించారు. అయితే.. ఉన్న‌త విద్య చ‌దివిన ఆయ‌న త‌న విజ్ఞానాన్ని ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా చేయ‌డం లేదు.

నిత్యం ఏదో ఒక వివాదంతో కాల‌క్షేపం చేస్తున్నారు. దీంతో కొలిక‌పూడి చుట్టూ అనేక విమ‌ర్శ‌లు, వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌లు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నిర‌స‌న గ‌ళం వినిపించారు. ఆయ‌న‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సీఎం చంద్ర‌బాబు నేరుగా ఈ విష‌యంలో జోక్యం చేసుకుని.. ఎమ్మెల్యేపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుతున్నారు. దీంతో కొలిక‌పూడి వ్య‌వ‌హారం మ‌రోసారి ర‌చ్చయింది.

తిరువూరు మండలం చిట్టేల గ్రామనికి చెందిన మహిళలు ఎమ్మెల్యే కొలిక‌పూడికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. కొలికపూడి శ్రీనివాసరావుపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సిబ్బంది ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్ లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకు నే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మహిళలు ముక్తకంఠంతో తెలిపారు. ఇటీవ‌ల ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ఎమ్మెల్యే ఫోన్ నుంచిఅస‌భ్య‌క‌ర సందేశాలు వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై వారు సీఎం చంద్ర‌బాబుకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. రోజులు గ‌డుస్తున్నా ఇంకా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో వారు ఉద్య‌మించారు. మ‌రో వైపు.. జ‌ర్న‌లిస్టుల‌ను బండ‌బూతులు తిట్టిన నేప‌థ్యంలో ఎమ్మెల్యే కొలిక పూడిపై చ‌ర్య‌లు కోరుతూ.. జ‌ర్న‌లిస్టు సంఘాలు కూడా నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే.