తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని, దీనిలో జంతువుల కొవ్వును వినియోగించారని పెద్ద ఎత్తున గత పది రోజులుగా ఏపీలో రాజకీయ దుమారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇది విమర్శలకు కూడా తావిచ్చింది.
వైసీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం, ప్రాయ శ్చిత్త దీక్షలు, ప్రక్షాళనలు కూడా జరిగిపోయాయి. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.
తాజాగా సోమవారం సుప్రీంకోర్టు తిరుమల లడ్డూపై దాఖలైన పిటిషన్‌లపై విచారణ చేపట్టింది. న్యాయ మూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లు తిరుమల లడ్డూ ప్రసాదంపై దాఖలైన పిటిషన్ల ను విచారణకు చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఇరువురూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని శ్రీవారి లడ్డూలు తయారు చేసేందుకు వినియోగించారన్న ఆధారాలు చూపించండి” అని న్యాయవాదులను ప్రశ్నించారు.
అంతేకాదు.. ఏ ఆధారాలతో తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆరోపణలు చేశారని నిలదీశా రు. “నేరుగా ఆయన మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? బాధ్యతాయుత ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇదేనా? రాజకీయాలను-మతానికి అంటగట్టకూడదన్న కనీస పరిజ్ఞానం ఆయనకు లేదా? విచారణకు ఆదేశించాలని అనుకున్నప్పుడు, లేదా ఆదేశించినప్పుడు.. ఈ సునిశిత విషయాన్ని రాజకీయంగా ఎందుకు వాడుకోవాలని ముఖ్యమంత్రి భావించారు. మతాన్ని-రాజకీయాలను కలగాపులగం చేస్తారా? “ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నేరుగా మీడియా ముందుకు వచ్చి.. ఒక మతానికి, ఒక ఆలయానికి సంబంధించిన విషయాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటారని ప్రశ్నించిన ధర్మాసనం.. మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. గుజరాత్ ల్యాబ్ రిపోర్టు జూలైలో వస్తే.. సెప్టెంబరు వరకు ఏం చేశారని.. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని, ఎందుకు మీడియా ముందుకు రాలేదని నిలదీసింది. పైగా.. గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన నివేదికిలో సదరు నెయ్యిలో చేపనూనె, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వులు కలిపారని స్పష్టంగా ఏమీ చెప్పలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
“ఒక అస్పష్ట నివేదికను పట్టుకుని ముఖ్యమంత్రి అయిన మీరు.. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న మీరు.. దేవుడిని.. రాజకీయాలకు ముడిపెట్టి మీడియా ముందు వివాదం సృష్టిస్తారా? రాజకీయాలకు దేవాలయాలను దూరంగా ఉంచుతారని మేం భావించాం. ఇప్పటికే విచారణకు ఆదేశించిన దరిమిలా.. మీరు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? ల్యాబ్ రిపోర్టు జూలైలో వచ్చింది. పైగా అస్పష్టంగా ఉంది. అయినా.. మీరు సెప్టెంబరు వరకు ఏం చేశారు?అని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్టు నిరూపించే ఆధారాలు ఏవి? ఎక్కడున్నాయి?” అని కోర్టు ప్రశ్నించింది.