రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎటు నుంచి ఎప్పుడు ఎలా పొంచి ఉంటారో చెప్పలేం. మన అనుకున్నవారే.. ప్రత్యర్థులుగా మారిన సందర్భాలు రాజకీయాల్లో కామనే. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వారు.. తర్వాత.. విభేదించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ పరిస్థితిని మించిన స్థితిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల నుంచి గతంలో ఎన్నడూ ఎదరవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా.. ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిపక్షంపై దాడి ఉంటుంది. ఇది సహజం. అయితే.. అసలు ఒక్క సీటును కూడా దక్కించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. జగన్ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన నాయకులు ఒక లెక్క అయితే.. తానే వదిలి పెట్టిన బాణం.. ఎదురుతిరిగి.. తనపైనే శరపరంపరలను ప్రయోగిస్తున్న తీరు మరో లెక్కగా మారింది. షర్మిల చేస్తున్న విమర్శలు.. వేస్తున్న కౌంటర్లు.. వెలికి తీస్తున్న విషయాలు.. జగన్‌కు తీవ్ర తలనొప్పిగా మారాయి.
అంతేకాదు.. అసలు షర్మిలకు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా ఏర్పడింది. గతంలో కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు వచ్చి సమాధానం చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఎవరూ బయటకు రాలేక పోతున్నారు. దీనికి కారణం.. నోరు లేని నాయకులు కాదు.. వైసీపీ నోరు విప్పలేని విధంగా షర్మిల వాయించేస్తుం డడమే దీనికి కారణం. ఒకటా రెండా.. అనేక విషయాల్లో షర్మిల సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కోలేక.. జగన్ శిబిరం చేతులు ఎత్తేసింది.
కొన్ని ఉదాహరణలు..
- వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ.. జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు.. దానికి ప్రతిగా షర్మిల ఏలూరులో ఎర్రకాలువ వరదలతో మునిగిపోయిన పొలాల్లోకి నడుములోతు నీటిలో దిగి.. జగన్ పాలనను తిట్టిపోశారు. దీంతో ఢిల్లీ ధర్నా వెలవెలబోయి.. షర్మిల కామెంట్లు హైలెట్ అయ్యాయి.
- కృష్ణానదిలో 4 ఇనుప పడవలు పిల్లర్లకు మధ్యలో ఉన్న సపోర్టులను ఢీ కొట్టిన విషయాన్ని షర్మిలే వెలుగులోకి తీసుకువచ్చారు. ఆమే వైసీపీపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. ప్రభుత్వం స్పందించి.. ఈ పడవల విషయంపై విచారణ చేపట్టింది. ఇది ఎంత రాజకీయం అయిందో అందరికీ తెలిసిందే. దీనికి వైసీపీ కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
- తాజాగా గనుల కుంభకోణంలో అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది. అయితే.. దీనిపై స్పందించిన షర్మిల.. “చిన్న చేపను కాదు.. ప్యాలెస్‌లో కూర్చున్న తిమింగలాన్ని అరెస్టు చేయాలి” అని సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా గనుల కుంభకోణంలో జగన్ పాత్రను ఆమె ఏకి పారేశారు.
- విజయవాడ వరదలు వచ్చినప్పుడు.. గడిచిన ఐదేళ్లలో బుడమేరకు గండ్లు పూడ్చలేదని.. ప్రాజెక్టులను పట్టించుకోలేదని షర్మిల దుయ్యబట్టారు. ఆ తర్వాతే.. టీడీపీ నేతలు.. వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీనికి కూడా వైసీపీ అధినేత సమాధానం చెప్పుకోలేక తర్జన భర్జన పడ్డారు.
- జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి డిక్లరేషన్ వివాదం వచ్చినప్పుడు కూడా.. షర్మిల హాట్ కామెంట్లు చేశారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని.. అన్నను ఉద్దేశించి ప్రభుత్వ పక్షం కంటే కూడా ఎక్కుడా నిలదీశారు. ఇలా.. జగన్ నోరు విప్పలేని పరిస్థితిని తీసుకురావడంలో షర్మిల దూకుడు నానాటికీ పెరుగుతుండడం గమనార్హం.