వారసుడికి పట్టాభిషేకం చేస్తున్న సీఎం స్టాలిన్

అధినేత ఎవరైనా తమ రాజకీయ వారసుడికి పట్టాభిషేకం చేసే విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంటారు. అందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారెవరైనా తమ సంతానాన్ని తమ స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా రంగం సిద్దం చేస్తుంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు సీఎం స్టాలిన్. తన కొడుకు ఉదయనిధి మారన్ ను తమిళనాడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా చేసేందుకు వీలుగా ముహుర్తాన్ని నిర్ణయించారు.

నిజానికి ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలన్న డిమాండ్ డీఎంకే శ్రేణుల నుంచి ఎప్పటి నుంచో ఉంది. పలుమార్లు ఆయన్ను డిప్యూటీ సీఎంగా చేస్తారన్న ప్రచారం సాగింది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికి డీఎంకే శ్రేణుల కల నెరవేరనుంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఉదయనిది ప్రమాణస్వీకారం జరగనుంది. తాజాగా సీఎం స్టాలిన్ మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు వీలుగా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఉదయనిధి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర క్రీడలమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన్ను.. డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తున్నారు. ఉదయ నిధి స్టాలిన్ తో పాటు మంత్రిగా సెంథిల్ బాలాజీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా రాజ్ భవన్ ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లారు.

దీంతో ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో.. ఆయన్ను మళ్లీ కాబినెట్ లోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు డాక్టర్ గోవి. చెళియన్.. ఆర్. రాజేంద్రన్.. ఎస్ఎం నాజర్ లను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే.. ఆ మధ్యన మరో ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. మరోవైపు శుక్రవారం సీఎం స్టాలిన్ ఢిల్లీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కూడా కలిశారు. మొత్తంగా తన ఢిల్లీ పర్యటన తర్వాత తన కొడుక్కి డిప్యూటీ సీఎంగా నియమించాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు.