బాబు రాక‌తో మ‌ళ్లీ లులూ జోష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో మ‌ళ్లీ పెట్టుబ‌డుల‌కు జోష్ పెరిగింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు మాసాల్లోనే ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇప్ప‌టికే కొన్ని పాత కంపెనీలు తిరిగి రాక ప్రారంభించ‌గా.. మ‌రికొన్ని ప్ర‌తిపాద‌న‌లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో దుబాయ్‌కు చెందిన లులూ గ్రూప్ కూడా మ‌రోసారి ఏపీపై దృష్టి పెట్టింది. తాజాగా లులూ గ్రూప్ చైర్మ‌న్‌.. ఎం.ఎ.యూసుఫ్ అలీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయ‌న సీఎంతో చ‌ర్చించారు. ఇరువురు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకుని ఆలింగ‌నం చేసుకున్నారు.

2015లోనే..

కాగా, లులూ గ్రూప్‌ను గ‌త టీడీపీ హ‌యాంలోనే చంద్ర‌బాబు ఏపీకి ఆహ్వానించారు. ఆహార త‌యారీ, హోట‌ళ్ల రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన లులూ సంస్థ‌లు.. దుబాయ్ బేస్‌డ్ గా ప‌నిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీలోని విశాఖ‌ప‌ట్నం, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులు పెట్టేందుకు గ‌తంలో అంటే.. 2015లోనే చంద్ర‌బాబు ఈగ్రూపును ఆహ్వానించారు. ప‌ర్యాట‌క‌, షిప్పింగ్‌, ఎగుమ‌తులు, దిగుమ‌తులు స‌హా ఐటీ రంగంలోనూ లులూ కంపెనీకి మంచి పేరుంది. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో ఐటీ స‌హా మాల్స్‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌పై అప్ప‌ట్లోనే ఒప్పందాలు కుదిరాయి.

అయితే.. ఈ ప్ర‌తిపాద‌న‌లు కార్య‌రూపం దాల్చే క్ర‌మంలో ఎన్నిక‌లు రావ‌డం.. 2019లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రమైన కార‌ణాలు.. వైసీపీ ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం లోపించ‌డంతో విశాఖ‌లో ఏర్పాటు చేయ‌ద‌ల‌చిన లులూ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయ‌లేక‌పోయారు. అంతేకాదు.. ఈ సంస్థ‌ను త‌మిళ‌నాడు స‌ర్కారు ఆహ్వానించింది. దీంతో అక్క‌డ ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌, దీనిపై రాజ‌కీయంగా కూడా ఏపీలో వివాదం ర‌గులుకున్న విష‌యం తెలిసిందే.

తాము తెచ్చిన పెట్టుబ‌డి దారుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం త‌రిమేసిందంటూ.. పెద్ద ఎత్తున టీడీపీ విమ‌ర్శ‌లు కూడా గుప్పించింది. అయినా.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం, మ‌రోసారి సీఎంగా చంద్ర‌బాబు ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్త‌లు, కంపెనీలు వ‌రుస‌గా తిరిగి వ‌స్తున్నాయి. కొన్నింటిని ప్ర‌భుత్వ‌మే ఆహ్వానిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా లులూ కంపెనీ కూడా ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది.