విశాఖపట్నంలో కొన్ని దశాబ్దాల కిందట ఏర్పడిన ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియ దాదాపు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మొగ్గ తొడిగిన ఈ ప్రతిపాదనను అడ్డుకునేందుకు అప్పటి సీఎం జగన్ ఏదో మొక్కుబడిగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో విశాఖ ఉక్కు వ్యవహారం రాజకీయ దుమారం దిశగా అడుగులు వేసింది. మరోవైపు 1350 రోజులుగా ఇక్కడి కార్మికులు ధర్నాలు, నిరసనలు చేస్తూ.. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిణామాలు సాగుతున్న క్రమంలో హైకోర్టులో పలు పిటిషన్లు కూడా పడ్డాయి. ప్రస్తుతం అవి విచారణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్కు పరిశ్రమను యథాతథ స్థితిలో కొనసాగిస్తున్నారు. ఇక, రాష్ట్రం లో కూటమి సర్కారు వచ్చిన దరిమిలా.. సీఎం చంద్రబాబు ప్రత్యేక అంశంగా దీనిని తీసుకుని కేంద్రంతో రెండు సార్లు చర్చలు జరిపారు. ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయరాదని.. దీనిని తాము కాపాడుకుంటామని కూడా చంద్రబాబు రెండు నెలల కిందట చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ భాగస్వామ్య పార్టీగా ఉండడంతో చంద్రబాబు సూచనలు, ఆయన ఇచ్చిన వినతులు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయకుండా.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి గత రెండు రోజులుగా చర్చ సాగుతున్నాయి.
ఈ విషయాన్ని ఏపీకి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా నిర్ధారించారు. 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం(300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి) సాధించేందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా సెయిల్‌లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మొత్తానికి ఈ పరిణామం.. కార్మికులకు ఊరటనిస్తోంది.