తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వరా?: చంద్రబాబు

తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, దోషులను పట్టుకునే విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అసలు జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని చంద్రబాబు నిలదీశారు.

ఒకవేళ జగన్ కు నమ్మకం ఉంటే అన్యమతస్థుల సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని, సంప్రదాయాన్ని గౌరవించకుంటే జగన్ తిరుమల ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు జగన్ కు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేసేందుకు కాదని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై జగన్ ను టీడీపీ నేతలు ప్రశ్నిస్తే బూతులు తిట్టారని, వైసీపీ హయాంలో రథం కాలిపోతే తేనెటీగలు వచ్చాయని వైసీపీ నేతలు చెప్పారని, తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని వెటకారం చేశారని గుర్తు చేశారు.

ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి హిందువుల మనోభావాలు దెబ్బతిసినందుకు భగవంతుడికి అందరం క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు అన్నారు. అపచారం చేసి అబద్దాలను నిజాలు చేయాలని చూడడం స్వామికి ద్రోహం చేసినట్లేనని చంద్రబాబు అన్నారు. తిరుపతి లడ్డు తయారీలో జంతువులు కొవ్వు వాడడం హిందూ ధర్మంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని, హిందువుల మనోభావాలను మాజీ సీఎం జగన్ దెబ్బతీశారని ఆరోపించారు.
ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు చేసిన కేంద్రం సిట్ టీంను ప్రకటించనుంది.

సిట్ టీం కోసం వినీత్‌ బ్రిజ్‌లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్‌, పీహెచ్‌డీ రామకృష్ణల పేర్లను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరాపై వివరణ ఇవ్వాలని ఏఆర్ డెయిరీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.