అనంతపురంలో రామాలయం రథం దగ్ధం..రంగంలోకి చంద్రబాబు

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన వ్యవహారంపై దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని, రథాలు తగులబెట్టారని అయినా దోషులను పట్టుకోవలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా ఏపీలో మరో వివాదం రాజుకుంది. అనంతపురం జిల్లాలోని రామాలయంలో రథం తగలబడిన వైనం షాకింగ్ గా మారింది.

అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన వైనం షాకింగ్ గా మారింది. మంటలను గుర్తించిన స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు, రథం దగ్ధం ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనపై సంబంధిత అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. అధికారులతో మాట్లాడిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే, అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయిందని చంద్రబాబుకు జిల్లా అధికారులు తెలిపాారు. ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అధికారులు, పోలీసులను ఆదేశించారు.

అంతేకాదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని కూడా ఆదేశించారు. ఆ ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.