ఈ సృజన్ రెడ్డి ఎవరు? కేటీఆర్ పొరబడ్డారా?

కేంద్ర ప్రభుత్వం అమ్రత్ పథకం నిధుల్లో రూ.8888 కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన సంస్థకు కాంటాక్టు ఇచ్చినట్లుగా కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవటం ఖాయమన్న కేటీఆర్.. ఎన్నికల వేళ ఆర్ఆర్ట్యాక్స్ పై మోడీ వ్యాఖ్యలు.. తాము ఆధారాలతో చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ తరచూ ప్రస్తావిస్తున్న ఫోర్త్ సిటీ మీదా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఫోర్త్ సిటీ కాదని.. ఫోర్ బ్రదర్స్ సిటీగా అభివర్ణించారు.

కేటీఆర్ సంచలన ఆరోపణల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్టు అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదన్న ఆయన.. “కేటీఆర్ చెబుతున్నట్లుగా అవినీతి నిరూపించకుంటే మాత్రం ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. రూ.8888 కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దాం” అంటూ సవాలు విసిరారు. అవినీతి ఆరోపణలు చేసిన కేటీఆర్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు. కేటీఆర్ ఆరోపణలు నిజమని తేలితే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని.. ఒకవేళ.. కేటీఆర్ చెప్పింది అబద్ధమని తేలితే తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తారా? అంటూ ప్రతిసవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే తాను మీడియాతో మాట్లాడుతున్నట్లు చెప్పటం ద్వారా.. తాను చెప్పే విషయాలన్ని కూడా ముఖ్యమంత్రి వాదనగా ఆయన చెప్పేశారు. పరిపాలనా అనుమతులు ఇచ్చిందే రూ.3516కోట్లకేనని.. పన్నులు.. ఇతరత్రా కలిపినా రూ.5385 కోట్లుగా ఉందన్నారు. అలాంటప్పుడు రూ.8888 కోట్ల ఫిగర్ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. నేరుగా నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయా? అని ప్రశ్నించారు.

“పదేళ్లు అబద్ధాలతో ప్రజలను వంచించారు. ప్రతిపక్షంలోకూడా అబద్ధాలు చెబితే ఆ హోదా కూడా పోతుంది.పదేళ్లు పురపాలక మంత్రిగా పని చేసిన కేటీఆర్.. ప్రస్తుత పురపాలక మంత్రి అయిన ముఖ్యమంత్రి మీద దురుద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలకు పాల్పడుతున్నారు. వాటిని నిరూపించకపోతే చట్టపరంగా చర్యలు ఖాయం. అమ్రత్ పథకం పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది 2023 సెప్టెంబరు 20న. అది మీ ప్రభుత్వమే. తెల్లవారితే పోలింగ్ ఉండగా నవంబరు 29న ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రూ.3515 కోట్లకు బిడ్ ను ప్రభుత్వం తెరిచింది. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే లోపు 3.99 శాతం అదనానికి మూడు కంపెనీలకు కట్టబెట్టారు. మూడింటిలో ఒకటి ఏపీకి చెందిన వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్.. మరొకటి గజా కన్ స్ట్రక్షన్.. మూడోది మేఘా. డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్ల విషయం సీఎం వరకు వచ్చింది. వాటిని రద్దు చేసి.. పాత ఎస్ఎస్ఆర్ ధరల ప్రాకరం మళ్లీ టెండర్లు పిలిచాం” అంటూ అప్పట్లో జరిగింది చెప్పుకొచ్చారు.

కేటీఆర్ ఆరోపించినట్లుగా సోదా కంపెనీ ఎండీ సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత బావమరిది కాదని.. గతంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అల్లుడని చెప్పారు. ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి మారారని చెప్పారు. కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి మారినందుకు సృజన్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి పనుల్లో రూ.2300 కోట్ల విలువ చేసే 7వ ప్యాకేజీ పనులు బహుమతిగా ఇచ్చారన్నారు.

“నిజానికి సృజన్ రెడ్డి కేటీఆర్ కే దగ్గరి మనిషి. సృజన్ రెడ్డి మామ కందాళ ఉపేందర్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థిగా నా మీద పోటీ చేసి ఓడారు. బీఆర్ఎస్ హయాంలో 3.99 శాతం అదనపు అంచనాలతో టెండర్లు పిలిస్తే మా ప్రభుత్వం2.44 శాతానికి తగ్గించి టెండర్లుఖరారు చేసింది” అంటూ అసలు వివరాల్ని చెప్పుకొచ్చారు. దీంతో.. ఇప్పటివరకు కేటీఆర్ చెప్పిన సృజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ బావమరిది అన్న దాని కంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లుడన్న విషయాన్ని పొంగులేని చెప్పిన నేపథ్యంలో.. ఏ మాత్రం హోం వర్కు చేయకుండానే కేటీఆర్ ఇలాంటి ఘాటు ఆరోపణలుచేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.