లడ్డూ వివాదంతో రాజస్థాన్ సీఎం అలర్ట్

హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, నెయ్యి కలిపారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. కమీషన్లకు కక్కుర్తి పడి ఆ తరహా నెయ్యిని గత ప్రభుత్వం లడ్డూ తయారీలో వాడిందని సాక్ష్యాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ నిర్వాకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపై లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని తిరుమలలోనే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యిని పరీక్షించి గుర్తించిన సెంటర్ ఫర్ అనలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ (ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్) ల్యాబ్‌ తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. నెయ్యిలో నాణ్యత పరీక్షకు అవసరమైన రూ. 75 లక్షల విలువైన పరికరాల ఏర్పాటుకు ఎన్‌డీడీబీ సిద్ధమైంది. టీటీడీ ఉద్యోగులకు ఆ పరికరాలను వాడడంలో శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. 2024 డిసెంబర్‌లోపు తిరుమలలో ఆ ల్యాబ్ ఏర్పాటు చేయబోతోందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

వాస్తవానికి 2015-16లోనో నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు తిరుమలలో ఓ ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ..గత ప్రస్తుతం అది నిరుపయోగంగా మారిందని చెప్పారు. ఇక, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈ రోజు సాయంత్రం ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించబోతున్నామని శ్యామల రావు తెలిపారు.

మరోవైపు, తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లోని అన్ని ఆలయాల్లో సమర్పించే భోగం, ప్రసాదం నాణ్యత, శుభ్రతను ఈ నెల 23 నుంచి 26 వరకు తనిఖీ చేయాలని నిర్ణయించింది. ’శుద్ధ్ ఆహార్, మలీవత్ పర్ వార్’ అనే ప్రచారాన్ని ఆ రాష్ట్ర సీఎం ప్రారంభించారు. ఇక, తిరుమల లడ్డూ వివాదంపై ఇండియన్ డైరీ బ్రాండ్ అమూల్ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తామెప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని, టీటీడీకి అమూల్ నెయ్యి సరఫరా చేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఖండించింది.