సీఎం చంద్రబాబు పదే పదే తాము ప్రజా సేవకులమని చెబుతుంటారు. తమకు అధికారం ఇచ్చినా.. ఆ అధికారాన్ని ప్రజల సేవ కోసం వినియోగిస్తామని ఆయన అంటూ ఉంటారు. అలానే ఆయన కూడా వ్యవహరిస్తున్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలోకి దిగి.. చంద్రబాబు బాధితులను పరామర్శించారు. దీంతో తమకు వచ్చిన గంభీరమైన ఆవేదనను కూడా బాధితులు దిగమింగుకుని కనిపించారు. ఇక, మంత్రులు మొత్తంగా చంద్రబాబు పిలుపుతో సేవలకు రంగంలోకి దిగారు.
అయితే.. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే.. ముగ్గురు మంత్రులు మాత్రమే సేవకులుగా కనిపిస్తే.. మిగిలిన వారు కాలికి నీళ్లు తగలకుండా పనిచేశారు. ఇప్పుడు ఈ జాబితానే చంద్రబాబు రెడీ చేసుకున్నారు. సరే.. ఈ స్టోరీ ఎలా ఉన్నప్పటికీ.. ఆ ముగ్గురు మంత్రుల గురించి.. చంద్రబాబు ప్రస్తావిస్తూ.. పొగడ్తల వర్షం కురిపించారు. వారిలో ముందు వరుసలోఉన్నది నిమ్మల రామానాయుడు. రెండో మంత్రి గొట్టిపాటి రవి, మూడో మంత్రి అనగాని సత్యప్రసాద్. వీరంతా కూడా.. అధికారం చలాయించకుండా.. వరదల సమయంలో నిజమైన ప్రజాసేవకులుగా పనిచేయడం గమనార్హం.
నిమ్మల: బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన తొలి రోజు పర్యటించారు. దీనికి కారణం తెలుసుకున్నారు. ఆ వెంటనే బుడమేరకు పడిన భారీగండిని పూడ్చే పనిని సీఎం ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఆర్మీని, జలవనరుల శాఖ అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ.. రేయింబవళ్లు అక్కడే ఉండి.. గండిని పూడ్చారు. ఫలితంగా.. నాలుగు రోజుల పాటు తిప్పలు పెట్టిన వరదలకు బ్రేకు పడింది. ఈయనకు అప్పట్లోనే మంచి ఎలివేషన్ వచ్చింది.
గొట్టిపాటి, అనగాని: ఇద్దరూ కూడా తెనాలి ప్రాంతంలో కృష్ణానది వరద కారణంగా కుడి కరకట్టకు ప్రమాదం పొంచి ఉందని తెలిసి..యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగారు. కరకట్టను పటిష్ఠ పరిచేందుకు రేయింబవళ్లు కష్టపడ్డారు. మంత్రులు ఇద్దరూ అక్కడే తిష్ఠవేసి మరీ కరకట్టను బలోపేతం చేశారు. మొత్తం 35 కిలో మీటర్ల మేరకు కరకట్టను బలోపేతం చేశారు. దీనికిగాను సొంతంగానే సైన్యాన్ని రంగంలోకి దింపారు. 8 జేసీబీలు, 100కు పైగా ట్రాక్టర్లను వినియోగించారు. వీరి ప్రయత్నం సఫలం అయింది. అలా కాకపోయి ఉంటే.. పదుల సంఖ్యలో ప్రజలు నీట మునిగిపోయి ఉండేవారు. వీరిని కృషిని గుర్తించిన చంద్రబాబు తాజాగా ప్రశంసలతో ముంచెత్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates