‘శ్రీవారి ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిపారు’

అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నిలువునా మోసం చేసింద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ప‌విత్రంగా భావించే తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదంలో కొన్ని జంతువుల కొవ్వును క‌లిపి.. భ‌క్తుల మ‌నోభావాల‌ను మంట‌గ‌లిపింద‌ని వ్యాఖ్యానించారు. తాజాగా బుధ‌వారం సాయంత్రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఆయ‌న మాటల్లోనే..

  • తిరుమల ఎంత ప‌విత్ర‌మండి. శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు ఎంతో దూరం నుంచి అనేక వ్య‌య ప్ర‌యాస‌లు ప‌ఢి భ‌క్తులు వ‌స్తారు. అలాంటివారిని కూడా మోసం చేస్తారా? గ‌త ప్ర‌భుత్వం తుగ్ల‌క్ మాదిరిగా.. శ్రీవారి ప్ర‌సాదాన్ని కూడా క‌లుషితం చేసింది. జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యిని వాడి తిరుప‌తి ల‌డ్డూ ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును క‌లిపారు. ఇంతక‌న్నా దుర్మార్గం ఉంటుందా? అందుకే నందిని సంస్థ‌తో తిరుమ‌ల ఒప్పందం చేసుకుని.. స్వ‌చ్ఛ‌మైన ప్ర‌సాదాన్ని భ‌క్తుల‌కు చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.
  • త‌ప్పులు చేసిన వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టం. త‌ప్పు చేసిన వారికి క్ష‌మాభిక్ష పెట్ట‌కూడ‌దు. పైగా వైసీపీ హ‌యాంలో అధికారం అండ చూసుకుని రెచ్చిపోయారు. వారిని ఉపేక్షించం. ఇప్పుడు మేం వ‌దిలేస్తే.. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌వించ‌న‌ట్టుగానే ఉంటుంది. అందుకే వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అన్ని అవ‌క‌త‌వ‌క‌ల‌పైనా నిగ్గు తేలుస్తున్నాం. అంద‌రినీ విచారిస్తాం. ప్ర‌స్తుతం ఇసుక‌, గ‌నులు, పింఛ‌న్లు, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌, ప‌త్రిక‌ల కొనుగోలుకు ఇచ్చిన సొమ్ము ఎటుపోయింది? మ‌ద్యం స‌హా అన్ని విష‌యాల‌పైనా విచార‌ణ చేస్తున్నాం. త‌ప్పు చేసిన‌ట్టు తేలిన‌ అంద‌రినీ లోప‌లేస్తాం.
  • వలంటీర్ల విష‌యంలో మేం కాదు.. గ‌త తుగ్ల‌క్ ప్ర‌భుత్వ‌మే త‌ప్పు చేసింది. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే వ‌లంటీర్ల వ్యవస్థ గడువు ముగిసింది. అయినా రెన్యువల్‌ చేయలేదు. అలా ఎందుకు చేయ‌లేదో వ‌లంటీర్లు ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. ఆయ‌న ఇంటికి వెళ్లి నిల‌దీయాలి. 2023లోనే వ‌లంటీర్ల గ‌డువు పూర్త‌యింది. అయినా వారిని కొన‌సాగించ‌కుండా మోసం చేశారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ చేసిన త‌ప్పుల‌ను మా పై రుద్దుతున్నారు.