“రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే.. ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మోడీ గ్యారెంటీ!” -ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు పదేపదే చెప్పిన మాట గుర్తుంది కదా!
ఈ మాటను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే రాజమండ్రి, విజయవాడ(మంగళగిరి) సభల్లో పెద్ద ఎత్తున ప్రకటించారు. రెండు చోట్లా సర్కారు ఒకటే ఉంటే.. ఏపీ ప్రయోజనాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
మరి మేలు జరిగిందా? ముఖ్యంగా చంద్రబాబుకు ఈ డబుల్ ఇంజన్ సర్కారుతో ప్రయోజనం చేకూరిందా? అనేది ఇప్పుడు ప్రశ్న. కీలక మైన వరదలు, తుఫానుల సమయంలో కేంద్రం నుంచి ఏమేరకు ఆయనకు మద్దతు లభిం చింది? ఎంత వరకు డబుల్ ఇంజన్ సర్కారు ఆదుకుంది? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఈ నెల 1న విజయవాడలో సంభవించిన వరదలు.. ఈ నెల 9వ తేదీ తర్వాత.. ఏలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరదల కారణంగా కాకినాడలోని 65 గ్రామాలు నీటమునిగాయి.
ప్రజల ప్రాథమిక అవసరాల వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీర్చగలిగింది. అసలైన నష్టం.. కష్టం తీర్చేందుకు కేంద్రంపైనే ఆధారపడాల్సిన అవసరం.. పరిస్థితి రెండూ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏలేరును పక్కన పెట్టిన చంద్రబాబు విజయవాడలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ప్రాథమికంగా 6880 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నివేదికను పంపించారు.
కానీ, ఇప్పటి వరకు.. కేంద్రం నుంచి రూపాయి కూడా రాలేదు. గత నెల ప్రారంభంలో కేరళలోని వయనాడ్ జిల్లాలో సంభవించిన వరదల విషయంలో మోడీ సర్కారు వెంటనే స్పందించింది. తక్షణ సాయంగా 100 కోట్లు ఇచ్చేశారు.
అక్కడ ప్రాథమిక నివేదికలతో పనిలేకుండానే నిధులు మంజూరు చేశారు. కానీ, అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు లేదు. అయినా.. సాయం అందించారు. మరి ఏపీ విషయానికి వస్తే.. మాత్రం ఇలా తాత్సారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డబుల్ ఇంజన్ సర్కారుతో చంద్రబాబు జరిగిన మేలు ఏమీ లేదన్నది పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మున్ముందు.. పరిస్థితి ఏంటన్నది ప్రశ్న.