ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు నెలలు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గత కొన్నాళ్లుగా రోజా నగరిని వీడినట్లేనని, ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే పార్టీలోని రోజా వ్యతిరేకులే ఈ ప్రచారం చేస్తున్నారని తేలింది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన రోజా నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మాజీ ఈడిగ కార్పోరేషన్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి దంపతులను పార్టీ నుండి సస్పెండ్ చేయించారు. నగరి వైసీపీ ఇంఛార్జ్ గా రోజా బాధ్యతలు స్వీకరించాక ఆమెకు అండగా నిలిచింది కేజే శాంతి దంపతులే.
2014, 2019 ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా గెలిచేందుకు వారు కృషిచేశారు. రోజా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీరి మధ్య దూరం పెరిగింది. టీడీపీ నుండి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది శాంతి దంపతలు ఆరోపణ. రోజా, శాంతి దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బెడిసికొట్టాయి. చివరకు రోజా ఓటమి పాలయింది.
నగరి వైసీపీలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నీ ఎన్నికల ముందే టీడీపీలో చేరిపోయాయి. శాంతి దంపతులు పార్టీలో ఉండి రోజా ఓటమికి పనిచేశారు. రోజా నగరిని వీడితే పార్టీ ఇంఛార్జ్ పదవులు తమకు వస్తాయన్నది ఈ దంపతుల ఆలోచన.
ఈ నేపథ్యంలో వీరి ప్రచారాన్ని గమనిస్తూ వచ్చిన రోజా జగన్ తో భేటీ సమయంలో అక్కడి పరిస్థితిని వివరించి వెంటనే సస్పెన్షన్ వేటు వేయించింది. ఈ దంపతులు ఇద్దరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి దగ్గరి వారు కావడం ఆసక్తికర అంశం. దీంతో నగరి రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా మారాయి. పార్టీలో ప్రత్యర్ధులను లేకుండా చేసుకున్న రోజా ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates