జ‌గ‌న్‌తో సెల్ఫీ.. క‌ష్టాలు తెచ్చుకున్న కానిస్టేబుల్‌!

ఒక‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌జ‌లు ముచ్చ‌ట‌ప‌డేవారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఈ జాబితా లో రాజ‌కీయ నాయ‌కులు కూడా చేరిపోయారు. రాజ‌కీయ నేత‌ల‌తోనూ.. ప‌లువురు ఇటీవ‌ల కాలంలో సెల్ఫీలు దిగు తున్నారు. సెల్ఫీలు దిగ‌డం ఇప్పుడు ఒక మోజుగా మారిపోయింది. అయితే.. ఈ మోజు ఒక్కొక్క సారి ఇబ్బందుల‌కు గుర‌వుతోంది. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌స్తుత మంత్రి, టీడీపీ నాయ‌కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేశారు.

ఈ స‌మ‌యంలో ఎక్సైజ్ శాఖ‌కు చెందిన ఓ అధికారి ఆయ‌న‌తో ఫొటో దిగారు. అంతే.. ఆ మ‌ర్నాడే ఆయ‌న‌ను స‌స్పెండ్ చేస్తూ.. ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది. అది కూడా గుంటూరు జైల్లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న మ‌హిళా కానిస్టేబుల్ ఆయేషా బాను చిక్కుల్లో ప‌డ్డారు. ఇటీవ‌ల జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగారు.

వీరిలో కానిస్టేబుల్ ఆయేషా బాను కూడా ఉన్నారు. ఆమె త‌న బిడ్డ‌తో క‌లిసి సెల్ఫీ దిగారు. ఇది సామాజిక మాధ్య‌మా ల్లో జోరుగా వైర‌ల్ అయింది. ప్ర‌ధాన మీడియా కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వార్త‌లు రాసింది. ప్ర‌భుత్వ ఉద్యోగి అయి ఉండి.. ఇలా చేయ‌డం ఏంట‌ని నిల‌దీసింది. ఇక‌, తాజాగా పోలీసులు ఆమెపై చ‌ర్య‌ల‌కు దిగారు. ప్ర‌స్తుతం ఇలా ఎందుకు సెల్పీ దిగాల్సి వ‌చ్చిందో చెప్పాలంటూ.. ఆమెకు మెమో జారీ చేశారు. దీనికి ఆమె ఇచ్చే వివ‌ర‌ణ ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు గుంటూరు జిల్లా జైల‌ర్‌(ఎస్పీ స్థాయి) తెలిపారు.

వివ‌ర‌ణ సంతృప్తిగా లేక‌పోతే.. కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయేషా బాను వ్య‌వ‌హారం పోలీసు వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. తొంద‌ర‌పడి ఎవ‌రితోనూ సెల్ఫీలు దిగ‌రాద‌ని.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. సీనియ‌ర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇక నుంచైనా.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.