రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. దీనినే నిరూపించారు.. ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురా మకృష్ణరాజు. తాజాగా ఆయన కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మతో భేటీ అయ్యారు.
మర్యాద పూర్వకంగానే ఇరువురు చర్చించుకున్నారు. అయితే.. వీరి భేటీకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి కారణం.. ఎన్నికలకు ముందు జరిగిన తీవ్ర పరిణామాలు.
వాస్తవానికి నరసాపురం ప్రాంతానికే చెందిన వర్మ-రాజు ఇద్దరూ మిత్రులు. ఆర్ఎస్ఎస్ నుంచి వర్మ రాజకీయాల్లోకి వచ్చారు. రఘురామ మాత్రం వ్యాపార వేత్తగా ఎదిగి.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ మంచి మిత్రులు.
అయితే.. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాజు.. నరసాపురం ఎంపీ టికెట్‌ను ఆశించారు. బీజేపీ నుంచైనా.. లేక టీడీపీ నుంచి అయినా.. ఆయన నరసాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.
కానీ, ఇదే సమయంలో బీజేపీ శ్రీనివాసవర్మకు ఈ టికెట్ ఇచ్చేసింది. దీంతో రఘురామ తీవ్రంగా హర్ట య్యారు. ఎన్నికల నామినేషన్ సమయంలో ఏదో ఒక క్షణంలో అయినా..త నను కరుణించకపోతారా? అని ఎదురు చూశారు. కానీ, కుదరలేదు.
దీంతో చివరకు.. చంద్రబాబు జోక్యం చేసుకుని ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో రఘురామ అక్కడ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
మరోవైపు వర్మ కూడా విజయం సాధించారు. అయితే..రఘురామ మనసులో మాత్రం పార్లమెంటుకు వెళ్ల లేక పోయానన్న ఆవేదన ఉంది. దీంతో వర్మతో ఆయన చాలా రోజులు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఇరువురు నేతలు భేటీ కావడం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే.. మూడు మాసాల కిందట జరిగిన రాజకీయ పరిణామాల జోలికి పోకుండా.. ఇరువురు నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీంతో ఇరువురి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు సమసిపోయినట్టేనని తెలుస్తోంది.