తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి నుంచి జీడిపిక్కల లోడ్‍తో వెళ్తున్న లారీ.. అర్థరాత్రి దేవరపల్లి వద్ద బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీపై ప్రయాణిస్తున్న కూలీలు.. లారీ కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. “లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతో కలచివేసింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదేసమయంలో క్షతగాత్రులకు అన్ని విధాలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కూడా ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం అన్నారు.
కాగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దేవరపల్లి రోడ్డు ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిలకావారిపాకలు దగ్గర చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవడం బాధాకరమని పేర్కొన్నారు. “కష్ట జీవులు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రభుత్వం ఆ కుటుంబాలను తగిన విధంగా ఆదుకొంటుంది” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఏం జరిగింది?
టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి జీడిగింజల లోడుతో నిడదవోలు మండలం తాడిమల్లకు ఓ లారీ వెళ్తోంది. అయితే.. మంగళవారం రాత్రి సమయంలో చినుకులు పడుతుండగా.. దారి సరిగా కనిపించలేదు. దీంతో చిన్నయగూడెం శివారులో అదుపు తప్పి పంట కాలువలోకి వాహనం బోల్తా కొట్టింది. ఆ సమయంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణం చేస్తున్నారు. వీరంతా కూలీలే. జీడీ గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. అయితే.. కేబిన్లో ఉన్న డ్రైవర్ సహా ముగ్గురు సురక్షితంగా ఉన్నారు.