తెలంగాణలో కరోనా జీరో… కేసులు తగ్గని ఏపీకి కేసీఆర్ గేట్లు ఎత్తేస్తారా?

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండో దశ లాక్ డౌన్ మే నెల 3తో ముగియనుంది. ఆ తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించాల్సిందేనని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పలు రాష్ట్రాల సీఎంలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గిపోతున్న తెలంగాణలో త్వరలోనే లాక్ డౌన్ ను ఎత్తేసే దిశగా అడుగులు పడటం ఖాయమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. సోమవారం యావత్తు తెలంగాణ వ్యాప్తంగా రెండండే రెండు పాజిటివ్ కేసులే నమోదైన నేపథ్యంలో మే 7 తర్వాత లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణతో విడదీయరాని బంధాలు ఉన్న ఏపీలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరి తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేస్తే… ఏపీతో సంబంధాలు, ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగితే… పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేతపై కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్ లో ఏపీకి చెందిన వేలు, లక్షలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేస్తే… దాదాపుగా నెల రోజులకు పైగా స్వస్థలాలకు వెళ్లేందుకు సాధ్యం కాని ఏపీ వాసులంతా ఏపీలోని తమ ఊళ్లకు వెళ్లేందుకు క్యూలు కట్టడం ఖాయమే. లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో వీరిని తెలంగాణ సర్కారు అడ్డుకోలేదు. మరి కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఏపీ వీరి ఎంట్రీని ఎలా అడ్డుకుంటుందన్నది కూడా ప్రస్తావనాంశమే. వీరి విషయంలో ఏపీ సంగతి ఎలా ఉన్నా… తమ సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ఏపీ వాసుల పట్ల తెలంగాణ సర్కారు ఎలా వ్యవహరిస్తుందన్నే అసలు సిసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే… కరోనా తీవ్రవ తగ్గని ఏపీకి వెళ్లి వచ్చే వారిని నిలువరించకపోతే… తెలంగాణలో కరోనా విజృంభణ తిరగబెట్టడం ఖాయమే. మరి ఈ ఉపద్రవాన్ని ఎలా అరికడతారన్నది మరింత కీలకాంశంగా మారింది.

లాక్ డౌన్ ఎత్తివేస్తే… ఒక్క ఏపీ నుంచే కాకుండా తెలంగాణకు పొరుగు రాష్ట్రాలుగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా ప్రజల రాకపోకలు మొదలవుతాయి. లాక్ డౌన్ ఎత్తివేస్తే… ఇలాంటి వారిని నిలువరించడం కేసీఆర్ సర్కారుకు సాధ్యం కాకపోవచ్చు. అలాగని సరిహద్దులు మూసేసి… కేవలం రాష్ట్రంలో రాకపోకలకు మాత్రమే అనుమతి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదనే మాట కూడా వినిబడుతోంది. తన సొంత రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రధానమన్న రీతిలో వ్యవహరిస్తున్న కేసీఆర్… దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే లాక్ డౌన్ ప్రకటించారు. అంతేకాకుండా రెండో దశ లాక్ డౌన్ ను కేంద్రం మే 3 వరకు మాత్రమేనని ప్రకటిస్తే… కేసీఆర్ స్వయంగా దానిని మే7కు పెంచేశారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య జీరో దిశగా పయనిస్తున్న వేళ… అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఇంకా తగ్గని కీలక సమయంలో లాక్ డౌన్ పై కేసీఆర్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసిందనే చెప్పాలి.