జ‌గ‌న్ వ‌ల్లే.. 6 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యులు:  చంద్ర‌బాబు

గ‌త వైసీపీ పాల‌న కార‌ణంగానే ప్ర‌స్తుతం బుడ‌మేరుకు వ‌ర‌ద వ‌చ్చింద‌ని.. దీంతో 6 ల‌క్ష‌ల మందికిపైగా నీట‌మునిగార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. వీరిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న బుడ‌మేరు ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఇటీవ‌ల చేప‌ట్టిన ఆర్మీ ప‌నుల‌ను, గండి పూడ్చివేసిన ప్రాంతాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. బుడ‌మేరును నిర్వ‌హించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని తెలిపారు. దీనివ‌ల్లే.. 6 ల‌క్ష‌ల మంది పైచిలుకు ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డార‌ని తెలిపారు.

విజ‌య‌వాడ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మునిగిపోయిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఆదుకునేందుకు.. చిట్ట చివ‌రి వ్య‌క్తి వ‌ర‌కు సాయం అందించేందుకు నిరంత‌రం ప‌నిచేస్తున్నామ‌న్నారు. ఇంత విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నార‌న్న చంద్ర‌బాబు.. వైసీపీ మాత్రం విషం చిమ్మేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. ఇలాంటివారికి ప్ర‌జ‌లు బుద్ధి చెప్పినా ఇంకా మార్పు రాలేద‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్వాకం కార‌ణంగానే బుడ‌మేరుకు గండ్లు ప‌డ్డాయ‌న్నారు.  

ఇప్ప‌టికీ చాలా మంది సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, కోటీశ్వ‌రులైన వైసీపీ నాయ‌కు లు.. ప్ర‌జా ధ‌నం దోచుకున్న‌వారు.. ఒక్క‌రంటే ఒక్క‌రు ఒక్క పులిహార ప్యాకెట్ కూడా పంచ‌లేక పోయారు. “మాట్లాడితే.. పెత్తందార్లు.. పేద‌లు అంటూ స‌న్నాయి నొక్క‌లు నొక్కుతాడు ఓ పెద్ద‌మ‌నిషి(జ‌గ‌న్‌). ఇప్పుడు ఎక్క‌డున్నాడు. పాస్ పోర్టు వ‌చ్చి ఉంటే.. ఇప్పుడు బ్రిట‌న్‌లో ఎంజాయ్ చేసేవాడు. క‌నీసం పేద‌ల‌ను ప‌ట్టించుకోవాల‌న్న జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఇంత విప‌త్తు వ‌స్తే.. మేం ఎలా స్పందిస్తున్నాం.. నిద్రాహారాలు మానేసి మా మంత్రులు ప‌నిచేస్తున్నారు“ అని  చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

ప్ర‌జ‌ల‌పై క‌సి తీర్చుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఎన్నిక‌ల్లో గెలిపించ‌లేద‌న్న క‌క్ష‌తో ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేశార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా వైసీపీ నాయ‌కులు బుద్ధిగాఉండ‌క‌పోతే.. స‌రైన గుణ పాఠం త‌ప్ప‌ద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ప్ర‌కాశం బ్యారేజీని ఇనుప బోట్లు ఢీ కొట్టిన ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ఎవ‌రు ఉన్నా.. వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. దీని వెనుక భారీ కుట్ర జ‌రిగింద‌ని.. రైతులు కూడా చెబుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచార‌ణ చేయిస్తామ‌న్నారు.