కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అమెరికాలోని జార్జ్ టన్ వర్సిటీ స్టూడెంట్స్ తో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లపై ఆయనకు ఒక కీలక ప్రశ్న ఎదురైంది. ‘‘భారతదేశంలో రిజర్వేషన్లు ఇంకెంత కాలం కొనసాగుతాయి?’’ అంటూ ఒక విద్యార్థి ప్రశ్నించారు.
దీనికి బదులిచ్చిన రాహుల్ గాంధీ.. భారతదేశం ఇప్పుడున్న స్థితి కంటే మెరుగ్గా మారితే దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామన్నారు. అయితే.. అదేమీ సమీప భవిష్యత్తులో లేదన్న విషయాన్ని తన మాటల్లో చెప్పకనే చెప్పేశారు. ‘‘ప్రస్తుతం భారత్ లో ఇంకా ఎందరి జీవితాలో మరాల్సి ఉంది. ఆ మార్పు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిద్దాం’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని గిరిజనులు.. ఓబీసీల వెనుకబాటుతనం గురించి మాట్లాడారు.
ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాల్లో ప్రతి వంద రూపాయిల్లో గిరిజనులకు అందుతున్నది పది పైసలు మాత్రమేనన్న రాహుల్.. దళితులకు మాత్రం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి వందలో ఐదు రూపాయిలు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఓబీసీల పరిస్థితి కూడా ఇలానే ఉందన్నఆయన.. భారత ఆర్థిక వ్యవస్థలో ఈ వర్గాలు భాగం కాలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. దాదాపు 90 శాతం మంది ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్నారన్న ఆయన.. వారిలో మార్పు వచ్చిన రోజే రిజర్వేషన్లు రద్దు సాధ్యమన్నారు.
ఈ సందర్భంగా మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. భారతదేశ బడా పారిశ్రామికవేత్తల జాబితాను పరిశీలించినప్పుడు తొలి వంద పేర్లలో ఒక్క ట్రైబల్ పేరు కూడా కనిపించలేదన్నారు. దళితులు.. ఓబీసీలకు కూడా అందులో స్థానం లేదన్నారు. భారత జనాభాలో ఓబీసీలు 50 శాతం ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దన్న ఆయన.. తొలి 200 మంది అధికారుల జాబితాలో మాత్రం ఒక్క ఓబీసీ పేరు చూడగలిగినట్లుగా చెప్పటం గమనార్హం. భారత వాస్తవ పరిస్థితికి తాను చెప్పే అంశాలే నిదర్శనమని చెప్పిన ఆయన.. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ మార్పులు తీసుకురావటానికి ఉన్న మార్గమే రిజర్వేషన్లుగా పేర్కొన్నారు. అగ్రవర్ణాలనుంచి వచ్చిన వారు దేశంలో ఒక వితండ వాదాన్ని తెస్తున్నారని.. ఆ కారణంగానే తాము శిక్ష అనుభవిస్తున్నట్లుగా ఒక వితండ వాదాన్ని తెర మీదకు తెస్తున్నారని.. తాము శిక్ష అనుభవిస్తున్నట్లు వారు వ్యాఖ్యానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా రిజర్వేషన్లపై రాహుల్ తనకున్న అభిప్రాయాలను సూటిగా.. స్పష్టంగా చెప్పేశారని చెప్పాలి.