తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలు గడువు విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు పెట్టాలని శాసనసభ కార్యదర్శికి హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడంతో పాటు సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి ఎంపీగా పోటీ చేశాడు. ఇక స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మీద బీఆర్ఎస్ పార్టీ మొదట కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది.
ఇక వీరి తర్వాత చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హత అంశం మీద కోర్టులో వాదనలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఒక వేళ రిపోర్ట్ సమర్పించని యొడల సుమోటోగా స్వీకరించి మరోసారి విచారణ చేస్తామని వెల్లడించింది. హైకోర్టు తీర్పు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది అన్నది వేచిచూడాలి.